బైక్ ను ఢీకొన్న లారీ.. తల్లీకూతురు స్పాట్ డెడ్ !

by Geesa Chandu |

తల్లి గారి ఊరికి వెళ్లి రాఖీ పౌర్ణమి, బోనాల పండుగ ముగించుకుని, తన స్వగ్రామమైన లింగంపేట్ కు బయలుదేరగా.. రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు దుర్మరణం చెందిన ఘటన గురువారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది.

బైక్ ను ఢీకొన్న లారీ.. తల్లీకూతురు స్పాట్ డెడ్ !
X

దిశ, జడ్చర్ల: తల్లి గారి ఊరికి వెళ్లి రాఖీ పౌర్ణమి, బోనాల పండుగ ముగించుకుని, తన స్వగ్రామమైన లింగంపేట్ కు బయలుదేరగా.. రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు దుర్మరణం చెందిన ఘటన గురువారం జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే...

జడ్చర్ల మండలం లింగంపేట గ్రామానికి చెందిన రేఖ (23) తన కూతురు సాత్విక (4) తో కలిసి, తన తల్లి గారి ఊరైన నాగర్ కర్నూలు జిల్లా ఎదిరేపల్లికి రాఖీ పౌర్ణమి సందర్భంగా వెళ్లారు. రాఖీ పౌర్ణమి ముగిశాక మృతురాలి చెల్లి బోనాల పండుగ ముగించుకొని వెళ్లాల్సిందిగా కోరింది. దీంతో బోనాల పండుగ ముగిశాక, మృతురాలి భర్త అయిన చెన్నకేశవులు లింగంపేట గ్రామంలో బోనాల పండుగ ఉంది. త్వరగా రావాలని తన భార్యను కోరాడు. దీంతో తన చెల్లెలు భర్త అయిన ఆంజనేయులుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎదిరేపల్లి నుండి లింగంపేట గ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో గంగాపూర్, కోడుగల్ రహదారిలో ఫర్టిలైజర్ లోడ్ తో వెళ్తున్న లారీని, ఓవర్టేక్ చేసే కార్యక్రమంలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో, ద్విచక్ర వాహనం అదుపుతప్పి తల్లీకూతురు రోడ్డుపై పడగా, ద్విచక్రవాహనం పక్కకు వెళ్ళింది. దీంతో రోడ్డుపై పడ్డ తల్లీకూతురు పై నుండి లారీ వెళ్లడంతో.. వారి తలభాగాలు ఛిద్రమై, అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆంజనేయులు ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాల నుండి బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటన స్థలం వద్దకు చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గంగాపూర్ కోడుగల్ వెళ్లే రహదారిపై ముళ్ల కంపలు వేసి, రహదారిని పూర్తిగా మూసేసి రాకపోకలను అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని, రహదారి వెడల్పుగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఆదిరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో ఆనంద్ ఘటన స్థలానికి చేరుకొని.. ప్రమాద తీరును పరిశీలించారు. సుమారు మూడు గంటల నుండి గంగాపూర్ కోడుగల్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా సంతోషంగా భార్యాపిల్లలతో కలిసి, బోనాల పండుగ చేసుకుందామని ఇంటికి రమ్మన్నానని.. ఇంతలోనే రోడ్డు ప్రమాదం తన భార్య కూతుర్ని కబళించిందని, ఇంక తను ఎవరితో కలిసి పండగ జరుపుకోవాలని, తనకు ఇప్పుడు దిక్కెవరని భర్త చెన్నకేశవులు బోరున విలపించడం అక్కడ అందర్నీకదిలించింది.

Next Story