క్రషర్ కార్మికుడి బలవన్మరణం

by Ratna Kumari |

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం దరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మోరంబావి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

క్రషర్ కార్మికుడి బలవన్మరణం
X

దిశ, నవాబుపేట : మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం దరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మోరంబావి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పండుగ నరేష్ (30) గురువారం రాత్రి తమ వ్యవసాయ పొలంలోని వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అవివాహితుడైన నరేష్ ఫరూక్‌నగర్ మండలం ఎలికట్ట సమీపంలోని క్రషర్ మిషన్‌లో కార్మికుడిగా పని చేసేవాడు. యధావిధిగా గురువారం ఎలికట్టకు వెళ్లి విధులకు హాజరై తిరిగి సాయంత్రం 7 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేష్, పొలం వద్దకు వెళ్లి గేదెల పాలు పితికి మిల్క్ సెంటర్‌లో పోశాడు. అనంతరం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తిరిగి పొలానికి వెళ్లి, అక్కడే పశువులను కట్టే తాడుతో వేపచెట్టుకు ఉరివేసుకున్నాడు. రాత్రి 9:30 గంటల సమయంలో అటుగా వెళ్లిన అతని పెదనాన్న కొడుకు పండుగ సాయిరాం మృత దేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. నరేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లి పెంటమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరిపి తమ కుమారుడి మృతికి గల కారణాలు వెలికితీయాలని పెంటమ్మ పోలీసులను కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు నరేష్ మృతికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌డుతున్నట్టు ఏఎస్సై జ‌నార్థ‌న్ తెలిపారు.

Next Story