అసమర్థ నాయకత్వంతో కుట్రలు చేసి నన్ను ఓడించిండ్రు : మాజీ ఎమ్మెల్యే గువ్వల

by Chintha Aamani |   (  Updated:2025-08-06 11:52:25  IST  )

అచ్చంపేట ప్రజలు 2007లో ఒక కార్యకర్తగా వచ్చిన సందర్భం నుంచి నేటి వరకు నన్ను అక్కున చేర్చుకొని నాకు ఈ స్థానం కల్పించారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.

అసమర్థ నాయకత్వంతో కుట్రలు చేసి నన్ను ఓడించిండ్రు :  మాజీ ఎమ్మెల్యే గువ్వల
X

దిశ, అచ్చంపేట : అచ్చంపేట ప్రజలు 2007లో ఒక కార్యకర్తగా వచ్చిన సందర్భం నుంచి నేటి వరకు నన్ను అక్కున చేర్చుకొని నాకు ఈ స్థానం కల్పించారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల వల్ల, తర్వాత గత రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బుధవారం అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో తన నివాసం వద్ద కార్యకర్తల సమావేశం అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలో రెండో స్థాయి పార్టీ క్యాడర్ అంతా కూడా వేరుగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం అలాగే బాలరాజు అభిమానులు యువత బాలరాజు నివాసానికి చేరుకున్నారు. రాజీనామా విషయంలో పునరాలోచన చేయాలని అక్కడికి వచ్చిన 99% నాయకులు బాలరాజును కోరారు. భావోద్వేగంతో కొందరు ఉన్నట్టుండి రాజీనామా ప్రకటించిన విషయాన్ని జీర్ణించుకోలేక కంటతడి పెట్టారు.

ఏ కష్టకాలంలో కూడా అధినాయకత్వం అండగా ఉండలే...

అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ అంటే గువ్వల బాలరాజు అనే విధంగా అధినేత కేసీఆర్ ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని ఈ క్రమంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మాత్రమే మంత్రి పదవిని ఆశించాను కానీ తదుపరి మంత్రి పదవి గురించి ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. 2024 శాసనసభ ఎన్నికల నాటి వరకు కూడా ఆ తదుపరి జరిగిన పరిణామాలలో కూడా ఏనాడు కూడా ఒకపక్క నా పైన హత్య చేసే కుట్రలు జరిగినా కూడా పార్టీ అధినేతలు ఆశించిన స్థాయిలో స్పందించలేదని అలాగే వెల్దండ వద్ద అరెస్టు చేసిన సమయంలో, కొండారెడ్డిపల్లి రైతు సాయి రెడ్డి చనిపోయిన సందర్భంగా ప్రతిపక్ష పాత్ర పార్టీ నాయకత్వం చొరవ చూపలేదని అనేక విషయాలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళితే వదిలేయాలని చెప్పడం లాంటి వ్యాఖ్యలు చేశారని బాలరాజు ఆరోపించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వాటిని ఆలోచించకుండా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని జరగలేదు నిరూపించాలని ఇలాంటి చర్చలతో కాలయాపన దాటవేసే ధోరణితో ఉన్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

నాలాంటి ప్రశ్నించే గొంతుకను నొక్కాలని...

అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ, కళాశాలలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయం పై నోరు ఇవ్వాలంటే పైనుండి పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వదు.. దీనికి అంతటికి కారణం స్థానికంగా ఉన్న ఒక వర్గం అధికారపక్షం మొన్నటి ఎన్నికల ముందే ఒక నిర్ణయానికి రావడం వలన నన్ను ఓడించి ఆ భూములను కబ్జా చేస్తున్నారని బాలరాజు మండిపడ్డారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలను 100 కోట్లకు కొనుగోలు చేసే విషయంలో జరిగిన పరిణామం అంతా కూడా దైవంగా భావించే కేసీఆర్ ఆలోచన విధానం తోనే తన సూచనతో నా సొంత కారులో కొంతమంది నేతలను ఫామ్ హౌస్ కు తీసుకెళ్లానన్నారు. అది కోర్టు పరిధిలో ఉంది దాని గురించి లోతైన విషయాలు చర్చించడం భావ్యం కాదన్నారు. ఆ సందర్భంగా వందలాది ఫోన్లు నన్ను భయభ్రాంతులకు గురిచేసాయని ఆ క్రమంలో కొందరు వీడియో కాల్ చేసి కత్తితో నిన్ను చంపేస్తాం అని చెప్పిన విషయాన్ని పార్టీకి దృష్టికి తీసుకెళ్లిన సీరియస్ గా పట్టించుకోలేదన్నారు. అచ్చంపేట ప్రస్తుతానికి సాగునీరు అందించే ఉమామహేశ్వర ప్రాజెక్టు గత ఎన్నికల ముందు ప్రాజెక్టు పైలాన్ ప్రారంభానికి నాయకత్వాన్ని రమ్మని కోరితే ప్రాజెక్టు ఉంటేనే గెలుస్తావా లేకుంటే గెలవవా అంటూ రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం టచ్ లో ఉన్నారు..

నేను రాజీనామా చేసిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మా పార్టీలో చేరాలని నాతో టచ్ లోకి వచ్చారు అన్న విషయం వాస్తవం అన్నారు. కానీ ప్రజల పక్షాన ప్రజల బాధలను అర్థం చేసుకునే పార్టీలవైపు మొగ్గు చూపుతారని పై రెండు పార్టీలతో చర్చించి నా ఆలోచన విధానానికి అనుకూలంగా లేకపోతే తదుపరి నా దారి ఎటో ప్రకటిస్తానన్నారు. కొందరి అసమర్థ కుట్రలు చేసి నన్ను ఓడించారన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా వచ్చేవారికి నా వెంట నడిచే వారికి అవకాశాలు కల్పిస్తానని, రేపటి స్థానిక ఎన్నికల్లో యువతరానికి అవకాశం ఇవ్వకపోతే గువ్వల బాలరాజు ఏంటో చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.

Next Story