- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధు పార్క్ అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో ఉంది.. వివాదంపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా నార్సింగి మధు పార్కు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులు ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. దీనిపై అపార్ట్‌మెంట్ వాసులు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో వివాదంగా మారి చర్చనీయాంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మధు పార్క్ అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో ఉందని కాంగ్రెస్ నేత, మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా నార్సింగి మధు పార్కు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులు ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. దీనిపై అపార్ట్‌మెంట్ వాసులు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో వివాదంగా మారి చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సామ రామ్మోహన్ రెడ్డి గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. గాంధీ ప్రాజెక్టుకి, మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కి సంబంధమే లేదని తేల్చి చెప్పారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో ఉందని, బఫర్ జోన్‌లో ఉంది కదా అని అపార్ట్‌మెంట్ వాసులపై మేము అధికారం చెలాయించట్లేదన్నారు. పైసా పైసా కూడబెట్టుకోని అపార్ట్మెంట్ కొనుకున్న ప్రజల బాధను అర్థం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్ వాళ్ళకి నష్ట పరిహారం చెల్లిస్తాం.. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అక్కడ స్క్వేర్ ఫీట్‌కు రూ. 3 వేల ధర ఉందని, ప్రభుత్వం రూ.5 వేలు ఇస్తామని చెప్పినట్లు స్పష్టం చేశారు.
ముప్పై రూపాయలు కూడా తీసుకురాలే..
కష్టపడి కొనుక్కున్న వాళ్ళకి నష్టం జరగవద్దని నష్టపరిహారం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. అపార్ట్‌మెంట్ వాళ్ళు మూసీ ప్రక్షాళనకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. నాడు బీఆర్ఎస్ నాయకులు మల్లన్న సాగర్ బాధితులను తరమడానికి ఊర్లోకి నీళ్లను వదిలారని ఆరోపించారు. మధు పార్క్ వెళ్ళిన హరీశ్‌రావు మల్లన్న సాగర్ ఎందుకు వెళ్ళలేదు? అని ప్రశ్నించారు. మూసీని మించి ప్రతిపక్ష నాయకులే అబద్ధాలతో ఈ రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు. పన్నెండు ఏళ్లలో మూసీ ప్రక్షాళనకు ముప్పై రూపాయలు కూడా కిషన్ రెడ్డి తీసుకురాలేదని మండిపడ్డారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయన్నారు. హైదరాబాద్ ప్రజలను ముంచాలని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ను వరదల నుండి కాపాడడం మా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. బతుకిచ్చిన మూసీ నదిని బతికిద్దాం.. మురికి కూపంగా మారిన మూసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు కనిపించిన చెరువులన్నీ కబ్జా చేశారని, సబర్మతి, యమునా, గంగా ప్రక్షాళన చేయాలంటున్న బీజేపీ మూసీ ప్రక్షాళన అంటే ఎందుకు అడ్డు పడుతోందని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల అబద్ధాల ప్రచారాలను తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు.






