రేవంత్‌రెడ్డి సాక్షిగా మదన్ మోహన్‌కు దక్కని ప్రాధాన్యం

by Disha Web Desk 4 |
రేవంత్‌రెడ్డి సాక్షిగా మదన్ మోహన్‌కు దక్కని ప్రాధాన్యం
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో టీపీసీసీ ఐటి సెల్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావుకు ప్రాధాన్యం దక్కలేదు. రాజంపేట మండల కేంద్రంలో ప్రజలనుద్దేశించి మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపైకి రేవంత్ రెడ్డి రాగానే ఆయనతో పాటు షబ్బీర్ అలీ, డీసీసీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఐటి సెల్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావులు వాహనం పైకి వచ్చారు.

అయితే టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుని హోదాలో మదన్ మోహన్ రావుకు రేవంత్ రెడ్డి పక్కన చోటు దక్కక పోవటం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి పక్కన ఆయన ప్రధాన అనుచరుడిగా పేరున్న వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి చోటు దక్కింది. రేవంత్ రెడ్డి కుడి పక్కన సుభాష్ రెడ్డి, ఎడమపక్కన షబ్బీర్ అలీ, ఆయన పక్కన కైలాస్ శ్రీనివాస్ రావు నిలబడ్డారు. కైలాస్ శ్రీనివాస్ రావు పక్కన నిల్చోవడానికి వచ్చిన మదన్ మోహన్ రావుకు మాత్రం అక్కడ చోటు దక్కలేదు. వెనక్కి నెట్టేయడంతో కైలాస్ శ్రీనివాస్ వెనకాల మదన్ మోహన్ రావు నిలబడాల్సిన పరిస్థితి ఎదురైంది.

దాంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డట్టయింది. ఇప్పటికే మదన్ మోహన్ రావు, సుభాష్ రెడ్డి వ్యవహారంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దానితో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరగబోయే టీపీసీసీ రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని ఇద్దరు కూడా నిన్న విడివిడిగా ప్రకటనలు విడుదల చేసారు. నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పక్కన నిలబడాల్సిన మదన్ మోహన్ రావు వెనకాల నిలబడటం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చకు తెరలేపింది.


Next Story

Most Viewed