స్థానిక ఎన్నికలపై సుదీర్ఘ చర్చ..! లీగల్ ఒపీనియన్ కోరిన కేబినెట్

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది.

స్థానిక ఎన్నికలపై సుదీర్ఘ చర్చ..! లీగల్ ఒపీనియన్ కోరిన కేబినెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. సుప్రీం ఆదేశాల మేరకు 50 శాతం లోపు రిజర్వేషన్లతో వెంటనే ఎన్నికలకు వెళ్లడమా? లేక రాష్ట్రపతి నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేద్దామా? అని ఆలోచన చేస్తున్నది. అయితే రాష్ట్రపతి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారోననే అంశంపై క్లారిటీ లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా అది పాజిటివ్‌గా ఉంటుందో? లేదోనని అనుమానాలున్నాయి. అందుకని ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై ఏం చేయాలనే అంశంపై సలహా ఇవ్వాలని కేబినెట్.. అధికారులను కోరింది.

ప్రభుత్వం ముందు రెండే ఆప్షన్లు

సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత ప్రభుత్వం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి 50 శాతం లోపు రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం. రెండోది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఎదురు చూడటం. ఎందుకంటే రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న 2018 పంచాయితీరాజ్ చట్టంలోని 285(A) నిబంధనను సవరిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపారు. ఆ బిల్లు ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా, ఆయన రాష్ట్రపతి పరిశీలన కోసం ఢిల్లీకి పంపారు. సుమారు నెల రోజులుగా ఆ బిల్లు ఢిల్లీలోనే పెండింగ్‌లో ఉంది. దానికి ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రపతి సైతం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ లేదని లీగల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

బీజేపీని అటాక్ చేసేందుకు ప్లాన్

రాష్ట్రపతి నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిదనే అభిప్రాయాలు సైతం కాంగ్రెస్‌లో ఉన్నాయి. ఒకవేళ గవర్నర్ పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా వెనక్కి పంపితే బీజేపీని అటాక్ చేయొచ్చనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీజేపీ సహకరించడం లేదని పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే కమలం పార్టీని మరింతగా ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉంటుందని ప్లాన్ చేస్తున్నారు.

రెండు రోజుల్లో రిపోర్టు ఇవ్వండి

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై రెండు రోజుల్లో న్యాయ సలహా తీసుకుని రిపోర్టు ఇవ్వాలని అధికారులను కేబినెట్ అదేశించింది. దీంతో అడ్వొకేట్ జనరల్, సుప్రీం కోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కలిసి సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

జూబ్లీహిల్స్ పోల్ తర్వాతే స్థానిక పోరు

రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేయడంతో 50 శాతం లోపు రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించక తప్పదు. అయితే వెంటనే ఎన్నికలకు వెళ్లడానికి ఉన్న రాజకీయ అంశాలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పార్టీ యంత్రాంగం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఫోకస్ పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం సరికాదని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని నవంబరు చివర లేదా డిసెంబరు రెండుమూడు వారాల్లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం మంచిదని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది.

Next Story