TG News : బీసీ రిజర్వేషన్లు ఏమయ్యాయి? : బీఆర్ఎస్ నేతలు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) నెరవేర్చిన తరువాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

TG News : బీసీ రిజర్వేషన్లు ఏమయ్యాయి? : బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) నెరవేర్చిన తరువాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నేడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకు పడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ నెరవేర్చిన తరువాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ తూతూ మంత్రంగా కేంద్రానికి బిల్లు పంపి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం కేవలం జీఓ ఇస్తే చట్టబద్దత ఎలా వస్తుందని అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంగీకారం కాదని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్ పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదని తలసాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(V.Srinivas Goud) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మళ్లీ మోసం చేసేందుకు, రిజర్వేషన్ల కోసం జీఓ అంటున్నారని ఆరోపణలు చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని జీఓ ఇస్తే సరిపోతుందని అన్నారు. పైసల్లేని శాఖలు, ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి బీసీలు అవమానపరచడం తప్ప కాంగ్రెస్ చేసిందేమి లేదని అన్నారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని, ఆ ఎన్నికలే అన్నీ తెలుస్తాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముందుగా కేబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత 32 జిల్లా పరిషత్ లలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు కాబట్టి బీసీలకు అన్యాయం చేయవద్దని హితవు పలికారు.

Next Story