అమల్లోకి ‘లోకల్’ ఎలక్షన్ కోడ్‌.. హ్యామ్ రోడ్ల టెండర్లకు బ్రేక్

by Kema Shiva Kumar |

హ్యామ్ రోడ్ల టెండర్లకు స్థానిక సంస్ధల ఎన్నికలు అడ్డొచ్చినట్లు తెలుస్తోంది.

అమల్లోకి ‘లోకల్’ ఎలక్షన్ కోడ్‌.. హ్యామ్ రోడ్ల టెండర్లకు బ్రేక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హ్యామ్ రోడ్ల టెండర్లకు స్థానిక సంస్ధల ఎన్నికలు అడ్డొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. టెండర్లు పిలిచే చివరి దశలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, పోలింగ్ తేదీలను ప్రకటించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే టెండర్ ప్రక్రియ, వాటికి సంబంధించిన పనులు మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన నివేదికలను అధికారులు యుద్ద ప్రాతిపదికన తయారు చేశారు. ప్రస్తుతం టెండర్లు పిలిచేందుకు అన్ని సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే టెండర్లు పిలువనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. హ్యామ్ లో ట్రాఫిక్ అధికంగా ఉన్న రోడ్లకు ప్రాధాన్యత, సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. డబుల్ లేన్ రోడ్డును 10 మీటర్లకు విస్తరించనున్నారు. మొదటి విడతలో భాగంగా 11 ప్యాకేజీలలో ఉమ్మడి జిల్లాలను యూనిట్ గా తీసుకొని, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్లు, సమస్యాత్మకంగా మారిన రహదారులు, శిథిలావస్థకు చేరిన రోడ్లు, భాగా దెబ్బతిన్న రోడ్లను గుర్తించి నిర్మాణం (పునురుద్దరించేందుకు) పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4 వేల కి.మీ రోడ్లను మొదటి దశలో నిర్మించేందుకు టెండర్లు పిలువనున్నారు.

17 నుంచి 11 ప్యాకేజీలకు పరిమితం

మొదటి సారిగా కేబినేట్ ఆమోదించిన 17 ప్యాకేజీల పనుల నుంచి 11 ప్యాకేజీలకు పరిమితం చేశారు. దాదాపు రూ.6478.33 కోట్లతో 17 ప్యాకేజీల కింద 373 రోడ్లను నిర్మించేందుకు నివేదికలు తయారు చేశారు. పలు జిల్లాల ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో హ్యామ్ రోడ్ల జాబితాను సవరించిన విషయం తెలిసిందే. మొదటి విడత హ్యామ్ రోడ్ల నిర్మాణాల్లో 16 జిల్లాల పరిధిలోని రోడ్ల పునరుద్ధరణకు ప్రాధాన్యత కల్పించారు. మంత్రి సొంత జిల్లా నల్గొండను రెండు సర్కిల్స్ గా విభజించి 44 రోడ్లను పునరుద్దరించేందుకు జాబితాలో చేర్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 537.78 కిలోమీటర్లు పొడువు రహదారులను పునరుద్ధరించేందుకు సుమారు రూ.622 కోట్లు కేటాయించారు. అనంతరం చేర్పులు మార్పులతో కొత్త జాబితాను 11 ప్యాకేజీలకు కుదించారు.

40:60 నిష్పత్తితో నిధులు

హ్యమ్ విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణాల వ్యయాన్ని ప్రభుత్వం, గుత్తేదారులు 40:60 నిష్పత్తితో నిధులు ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలో పునరుద్ధరించనున్న పలు రోడ్లకు 40 శాతం నిధులు ప్రభుత్వం కేటాయిస్తే, 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాలి. కాంట్రాక్టర్లు ఖర్చు చేసిన నిధులను ప్రభుత్వం వాయిదా పద్ధతిలో వడ్డీతో కలిపి చెల్లించనున్నది. 60 శాతం నిధులలో కూడా బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు ఇప్పించి పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోనున్నది.

నేడు హ్యామ్ రోడ్ల‌పై కీలక భేటీ

రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్లు చేపట్టేందుకు ఇప్పటికే అనేక సార్లు సమావేశాలు, నిర్మాణాలు చేపట్టనున్న రోడ్లను గుర్తించారు. వాటిలో నూ మొదటి పాధాన్యతలో చేపట్టాల్సిన రోడ్ల కోసం చేర్పులు, మా ర్పులు చేశారు. అయినప్పటికీ టెండరు ప్రక్రియ కార్యరూపం దాల్చ లేదు. వీటితో పాటు వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న అర్అండ్ బీ రోడ్ల మరమ్మతులపై నేడు కీలక సమావేశం నిర్వహించనున్నా రు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అర్అండ్ బీ స్పెషల్ సెక్రటరీ తదితర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, సీడీ వర్క్ లకు తాత్కాలి క మరమ్మతులు, శాశ్వత నిర్మాణాలు చేపట్టే కార్యాచరణపై చర్చ జరుగనుంది. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.70 కోట్లు తక్షణ మే అవసరం ఉందని అర్అండ్ బీ శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు.

Next Story