24 గంటల్లోనే యువతికి కాలేయమార్పిడి.. ఉస్మానియా డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

by Ramesh Naini |

కాలేయం పూర్తిగా చెడిపోయి.. కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువతికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసి పునర్జన్మ ప్రసాదించారు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు

24 గంటల్లోనే యువతికి కాలేయమార్పిడి.. ఉస్మానియా డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలేయం పూర్తిగా చెడిపోయి.. కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువతికి కాలేయ మార్పిడి (Liver transplant) శస్త్రచికిత్స పూర్తిచేసి పునర్జన్మ ప్రసాదించారు (Osmania Hospital Doctors) ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు.. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న దురాభిప్రాయాన్ని చెరిపివేసి.. బ్లెస్సీ గౌడ్ కు 24 గంటల్లోపే విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించిన ఉస్మానియా వైద్య బృందానికి నా అభినందనలు. ప్రతి ప్రభుత్వ వైద్యుడికి వారు ఆదర్శం కావాలి. బీటెక్ విద్యార్థిని బ్లెస్సీ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో తల్లితో పాటు నివాసం ఉంటున్న (Blessy Goud) బ్లెస్సీ గౌడ్‌కు తీవ్ర జ్వరంతో లివర్ ఫేయిల్యూర్ అయింది. దీంతో ఆ యువతి కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను మే 12వ తేదీన కుటుంబ సభ్యులు ఉస్మానియా హాస్పిటల్‌లో చేర్పించారు. బ్లెస్సీని పరీక్షించిన ఉస్మానియా వైద్యులు.. మే 14వ తేదీన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెచ్‌వోడీ మధుసూదన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసింది. రెండు వారాల తర్వాత బ్లెస్సీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని, ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎగ్జామ్స్‌కు హాజరవుతోంది. ఈ సందర్భంగా బ్లెస్సీ, ఆమె తల్లి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్లెస్సీ, నేడు పరీక్షలకు హాజరవుతుండడం పట్ల ఉస్మానియా డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.

Next Story