Messi Tour schedule: హైదరాబాద్‌లో లియోనెల్ మెస్సీ సందడి.. మెస్సీ టూర్ షెడ్యూల్ వచ్చేసింది!

by Ramesh Naini |

ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త.. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే.

Messi Tour schedule: హైదరాబాద్‌లో లియోనెల్ మెస్సీ సందడి.. మెస్సీ టూర్ షెడ్యూల్ వచ్చేసింది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త.. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్ పర్యటన పూర్తి షెడ్యూల్ విడుదల అయింది. షెడ్యూల్‌లో భాగంగా రేపు (శనివారం) మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడినుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక, మెస్సీతో ఫోటో దిగేందుకు పది లక్షల రూపాయాలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వంద మందికి అవకాశం కల్పించారు.

ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్‌బాల్ జట్టుతో 15 నిమిషాలపాటు మాట్లాడి, ఫుట్‌బాల్ ఆట మెళకువలు తెలపనున్నాడు. సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో అందరూ ఎదురుచూస్తున్న ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. 7:30 కి ఈ మ్యాచ్ ఏర్పాటు చేశారు. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, అపర్ణ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. చివరి ఐదు, పది నిమిషాల మ్యాచ్‌లో మెస్సీతో గ్రౌండ్‌లో సీఎం ఆడనున్నట్లు తెలిపారు.

మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. అనంతరం గెలుపొందిన టీమ్‌కు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి గోట్ ట్రోఫీని ప్రధానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి ప్రయాణం అవుతారు. కాగా, మెస్సీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ, 3,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Next Story