నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-28 16:04:33  IST  )

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది...

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విస్తరించాయని తెలంగాణ వాతావరణ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రుతుపవనాల ప్రభావం కారణంగా నేడు గురువారంతో పాటు రేపు శుక్రవారం నాడు కూడా రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్​లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సీయస్​గా నమోదైనట్లు తెలిపింది.

దీని ప్రభావం కారణంతో కొన్ని జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం తో ఈదురు గాలులు వీస్తాయని, అదే సమయంలో అటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మొత్తంగా చూస్తే వచ్చే జూన్ నెలలో భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ ) అంచనా వేసింది. ఇది దీర్ఘకాలిక సగటులో 108 శాతం ఉంటుందని అంచనా వేసింది. వచ్చే జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఇది దీర్ఘకాలిక సగటులో 108 శాతానికి చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని, జూన్ 11 నాటికి తెలంగాణకు చేరుకుంటాయని, ఇలా జూలై 8 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఈ సారి మాత్రం ఒకింత తొందరగానే నైరుతి తరుపవనాలు విస్తరించినట్లు వెల్లడించింది.

Next Story