- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీ కారిడార్‌కు వరద ముప్పు తప్పిద్దాం.. 15 రోజుల్లో పరిష్కారానికి ప్రణాళికలు
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్‌కు వరద ముప్పు తోడవ్వకుండా జాగ్రత్తలు తీసుకుందామని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్‌కు వరద ముప్పు తోడవ్వకుండా జాగ్రత్తలు తీసుకుందామని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన సూచించారు. వర్షాకాలంలో రహదారులపై ఏమాత్రం నీరు నిలిచినా తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. వర్షాకాల సన్నద్ధతపై సీఎంసీ (సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలోని సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిసనర్ సృజన సంయుక్తంగా సోమవారం హైడ్రా కార్యాలయంలో సమీక్షించారు. సీఎంసీ పరిధిలో మొత్తం 202 వాటర్ లాగింగ్ పాయింట్లుంటే.. అందులో 83 మేజర్, 95 మీడియం, 24 మైనర్ ప్రాబ్లం ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. 15 రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సంబంధిత శాఖల అనుమతుల కోసం లేఖలు రాసామని సరిపుచ్చవద్దన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
వరద కాలువల్లో పూడికను తొలగించే పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గాలి వానకు పడిపోయే ప్రమాదమున్న చెట్లను ముందుగానే గుర్తించి గ్రూమిగ్ చేయాలన్నారు. మ్యాన్‌హోల్స్ మూతలు ఎక్కడ ఉన్నాయనేది స్పష్టంగా అర్థమయ్యేలా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్ ద్వారా భారీ వర్షాల సమాచారాన్నివ్వడమే కాదు.. వరద ముప్పు ఉన్న దారుల గురించి.. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం చేయాలని హైడ్రా కమిషనర్ తెలిపారు. అంతకు ముందు మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా అదనపు కమిషనర్ వర్ల పాపయ్య వివరించారు. అలాగే మెట్ టీమ్స్, డీఆర్ ఎఫ్ బృందాల పనితీరును తెలిపారు.
30 చెరువులకు స్లూయజ్ గేట్లు..
సీఎంసీ పరిధిలో వరద నీరు పెద్దమొత్తంలో చేరే దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువు ఇలా 30 చెరువులున్నాయని.. వీటికి స్లూయజ్ గేట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సమీక్ష సమావేశం నిర్ణయించింది. చెరువులను ఖాళీ చేసి ఉంచితే వర్షం నీరు సాఫీగా చేరి వరద పోటెత్తే ప్రమాదం తగ్గుతుందని అధికారులు భావించారు. ఆర్‌యూబీల వద్ద ఏర్పాటు చేసిన పంపులు పని చేస్తున్నాయా లేదా.. వంతెనలపైన పడిన వర్షం నీరు రంద్రాల ద్వారా కిందకు వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. జూన్ 8వ తేదీనాటికి వర్షాలు ఆరంభమయ్యే పరిస్థితులున్నాయని.. ఈ ఏడాది తక్కువ వర్షాలున్నా.. పడినప్పుడు కుంభవృష్టి ఉంటుందని హెచ్చరించారు. అన్ని శాఖలతో హైడ్రా సమన్వయంగా పని చేసి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఎక్కడైనా ఇబ్బందులంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వివిధ శాఖలు చేసిన సూచనలమేరకు సమస్యలు పరిష్కారానికి సీఎంసీ చర్యలు తీసుకుంటుందని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. దాదాపు 98 శాతం డీసిల్టింగ్ పనులు పూర్తయ్యాయన్నారు. 161 వరకూ శిథిల భవనాలున్నాయని.. త్వరలోనే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్, జలమండలి, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల పనుల్లో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం తలెత్తే ట్రాఫిక్ సమస్యలను ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, అడిషనల్ డీసీపీ హనుమంతరావు వివరించారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ ఆర్ సుదర్శన్, సీఎంసీ పరిధిలోని జోనల్ కమిషనర్లు, ఏసీపీలు, డీఎప్‌వో గౌతమ్‌తో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొని వర్షాకాలం ఎదురయ్యే సమస్యలపై చర్చించారు.






