ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత

by Naga Rani Yarlagadda |

‘తెలంగాణ యూనివర్సిటీల చట్టం-1991’ని సవరిస్తూ రూపొందించిన బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత
X
  • తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు-2026కు శాసనసభ ఆమోదం
  • సీఎం తరఫున సభలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

దిశ, తెలంగాణ బ్యూరో : ఖనిజ సంపదకు నెలవైన కొత్తగూడెం ప్రాంతాన్ని విద్యా హబ్‌గా మార్చే లక్ష్యంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించిన డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి శాశ్వత ప్రాతిపదికన చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ‘తెలంగాణ యూనివర్సిటీల చట్టం-1991’ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి తరఫున, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టగా... ఆమోదం లభించింది. 1978లో స్థాపించిన కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ (తర్వాతి కాలంలో ఇంజనీరింగ్ కాలేజీ)ని అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. డిసెంబర్ 2025లో సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వర్సిటీకి, తాజా చట్ట సవరణ ద్వారా పూర్తి స్వయంప్రతిపత్తి లభిస్తుందన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి వచ్చే రెండేళ్లలో రూ. 500 కోట్లు కేటాయించనున్నామని తెలిపారు. యూనివర్సిటీ విస్తరణ కోసం 310 ఎకరాల భూమి అందుబాటులో ఉందని... ప్రపంచంలో ఎర్త్ సైన్సెస్ కోసం ప్రత్యేక వర్సిటీలు ఉండడం చాలా అరుదని తెలిపారు. సింగరేణి గనులు, గోదావరి నది, అటవీ సంపద ఉన్న కొత్తగూడెం ప్రాంతం విద్యార్థులకు ఒక లివింగ్ లాబొరేటరీగా ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం ఉన్న బీటెక్ కోర్సులతో పాటు, కొత్తగా బీఎస్సీ (జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్), ఎంఎస్సీ కోర్సులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ చట్టబద్ధత వల్ల యూనివర్సిటీకి సొంతంగా కరికులమ్ రూపొందించుకునే స్వేచ్ఛ, యూజీసీ నిధులు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. సింగరేణి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తెలంగాణను మైనింగ్, జియాలజీ రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టేందుకే ఈ యూనివర్సిటీని స్థాపించినట్లు మంత్రి సభకు వివరించారు.

ఫ్యాకల్టీ లేకుండా యూనివర్సిటీ ఏం లాభం: అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పక్ష నేత

కొత్త యూనివర్సిటీలు ప్రారంభించుకుంటూపోతే సరిపోదని... వాటికి తగ్గట్లుగా ఫ్యాకల్టీ మౌలిక వసతుల కల్పన ముఖ్యం. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేనేలేవు. విద్యాసంస్థలకు నేతల పేర్లు పెట్టడం వాటిని అప్ గ్రేడ్ చేస్తే సరిపోదు... వాటిని బలోపేతం చేయాలి. మన వద్ద నాణ్యమైన విద్య ఉంటే మన విద్యార్థులు విదేశాలకు ఎందుకు వెళ్తారు. ఈ కొత్త యూనివర్సిటీ డీపీఆర్ అయినా అయ్యిందా... అయితే సభ్యులకైనా అందుబాటులో ఉంచాలి కదా. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లోనూ కాలం చెల్లిన కోర్సులను వదిలేసి విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను తీసుకురావాలి. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి.

ఏదో ఆడంబరంగా ప్రారంభించి వదిలేయవద్దు : కూనంనేని సాంబశివరావు, సీపీఐ పక్ష నేత

కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ రావడం వల్ల ఈ ప్రాంత యువతకు చక్కని అవకాశాలు అందించే వీలుంది. అయితే ఆడంబరంగా ప్రారంభించి వదిలేసే బదులు అత్భుతంగా మార్చాలి. స్కిల్స్, స్పోర్ట్స్, ఎర్త్ యూనివర్సిటీల ప్రారంభోత్సవం ద్వారా సీఎం రేవంత్ సర్కారు పనితీరు చక్కగా ఉందని అర్థమవుతోంది. ఈ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు సింగరేణివే. వెంటనే స్టాఫ్, బడ్జెట్ కేటాయించి అత్భుతమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

Next Story