- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికలు: వామపక్ష పార్టీల నిర్ణయంపై ఉత్కంఠ!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ తేదీలను ఖరారు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ తేదీలను ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ రెండు విడతల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో అభ్యర్థులను బరిలో దింపి తమసత్తా చాటాలని అధికార కాంగ్రెస్ తోపాటు బీఆర్ఎస్, బీజేపీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే వామపక్ష పార్టీల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఒంటరిగా పోటీ చేస్తారా? ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారా? లేకపోతే మద్దతు ప్రకటిస్తారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. దీనిపై ఈ రెండు పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఇటీవల పల్లా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. కూనంనేని సాంబశివరావుకు జాతీయ కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా వనపర్తికు చెందిన జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన ఆయా పార్టీల అధిష్టానాలు.. ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని ఆయా పార్టీల కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పలు జిల్లాల్లో పార్టీలకు ఓటు బ్యాంకు
రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సీపీఎం, సీపీఐ పార్టీలకు ఓటు బ్యాంకుతోపాటు చెప్పుకోదగ్గ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఉన్నారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో వామపక్షాల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. సింగరేణి కోల్ బెల్ట్‌లోనూ ఈ లెఫ్ట్ పార్టీలకు ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతు కోరింది. అసెంబ్లీ ఎలక్షన్ టైమ్‌లోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదురుతుందని భావించినా.. సీట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం రాకపోవడంతో సీపీఎం ఒంటరిగానే పోటీ చేసింది. అయితే చాలా చోట్ల బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్‌కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలికింది. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నది. మరోవైపు పార్టీకి కనీస ఓట్లు సాధించాలన్న భావనలో సీపీఎం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలువడిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌పై ఆయా పార్టీల అధిష్టానాలు స్పష్టమైన ప్రకటన చేసే వరకు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కనిపిస్తున్నది.






