- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లీఫ్స్ సంస్థ సరికొత్త ప్రయోగం.. టార్గెట్ లక్ష మంది రైతులు
తెలంగాణలో కనీసం లక్ష మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం, రైతుల న్యాయ అవసరాలపై అధ్యయనం చేయడం కోసం లీఫ్స్ సంస్థ సాగు న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కనీసం లక్ష మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం, రైతుల న్యాయ అవసరాలపై అధ్యయనం చేయడం కోసం లీఫ్స్ సంస్థ సాగు న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 800 గ్రామాల మీదుగా 2,400 కి.మీ. దూరం పర్యటించేందుకు ఏర్పాట్లు చేసింది. 28వ తేదీన భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తున్నారు. భూ చట్టాల నిపుణులు, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు ఎం.సునీల్ కుమార్ నాయకత్వంలో లీఫ్స్ సంస్థ, న్యాయవాదులతో కూడిన బృందం న్యాయ యాత్రను నిర్వహిస్తున్నారు. దుక్కి దున్నే నాటి నుంచి పండించిన పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, మారుతున్న సవాళ్లకు తగ్గట్టుగా సాగు సాఫీగా సాగడం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. భూమి, వ్యవసాయానికి సంబంధించి రాష్ట్రంలోనూ రెండు వందలకు పైగా చట్టాలు అమల్లో ఉన్నాయి. వీటిని తెలుసుకొని వినియోగించుకోగలిగితేనే సాగు చేసే పరిస్థితి.
భూమి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లినప్పుడు, మార్కెట్ మోసాలు జరిగినప్పుడు, పంటల బీమా అందనప్పుడు.. పలు సందర్భాల్లో రైతులకు చట్టాలతో అవసరం ఏర్పడుతుంది. అందుకే ప్రతి రైతుకు చట్టాలు తెలియాలి. ఆ చట్టాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సునీల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో లక్ష మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో భూమి సునీల్ నాయకత్వంలో నడుస్తోన్న లీఫ్స్ సంస్థ సాగు న్యాయయాత్రను ప్రారంభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బృందం ఏకంగా 2,400 కిలోమీటర్లు పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కనీసం 10 వేల మంది రైతులను నేరుగా కలిసి, వారికి కీలకమైన వ్యయసాయ చట్టాలను బృందం వివరిస్తుంది.
భూమి, విత్తనం, సాగు నీరు, పంట రుణాలు, పంటల బీమా, వ్యయసాయ మార్కెట్లకు సంబంధించి అమల్లో ఉన్న కీలక చట్టాలను వివరిస్తారు. ఈ మేరకు రూపొందించిన కరపత్రాలను రైతులకు పంపిణీ చేస్తుంది. ఈ 10 వేల మంది రైతులు ఒక్కొక్కరు కనీసం పది మందికి ప్రచారం చేసినా లక్ష మందికి చేరుకుంటామని సంస్థ భావిస్తున్నది. ఈ యాత్రలో భాగంగా రైతుల న్యాయ అవసరాలపైనా అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనం రైతులకు మెరుగైన ఉచిత న్యాయ సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఓ వైపు అధ్యయనం, అలాగే వ్యవసాయ చట్టాలను వివరించడం.. ఏకకాలంలో రెండు వినూత్న ప్రయత్నం చేయడం దేశంలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.
28న రూట్ మ్యాప్
ఈ నెల 28న లీఫ్స్ బృందం పర్యటించే రూట్ ని భూమి సునీల్ ప్రకటించారు. భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, మునుగోడు, చండూరు, నాంపల్లి, మల్లేపల్లి మీదుగా ప్రయాణిస్తారు. ఐతే సభలు, సమావేశాలు పెట్టకుండా పొలాల్లో పని చేసే రైతులతోనే బృందం ముచ్చటిస్తుంది. ఏమేం చట్టాలో ఉన్నాయో వివరిస్తారు. అన్నీ ఆగినా వ్యవసాయం ఆగొద్దనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నట్లు సునీల్ తెలిపారు. అందుకే లీఫ్స్ సంస్థ రైతులకు చట్టాన్ని చుట్టం చేసే పనిలో నిమగ్నమై ఉందన్నారు. తమకు అందరూ తోడుగా నిలవాలని, రైతులకు అండగా నిలువాలని కోరారు. ఎవరైనా సాగు న్యాయయాత్రలో భాగస్వామ్యం కావాలనుకుంటే ఈ చిరునామాలో సంప్రదించొచ్చునన్నారు. లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్), 12-13-484/9/A, 2 వ అంతస్థు, నాగార్జున నగర్, రోడ్ నెంబర్ 2, బ్యాంకు ఆఫ్ బరోడా దగ్గర, తార్నాక. సెల్: 98499 67756. రైతులకు ఉచితంగా సేవ చేయాలనుకునే ఎవరైనా తమ లక్ష్య సాధనలో భాగస్వాములు కావచ్చునన్నారు.






