గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ఆశలు.. ఆశావహుల సంప్రదింపులు స్టార్ట్

by Mahesh |
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ఆశలు.. ఆశావహుల సంప్రదింపులు స్టార్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పేర్లను సెలెక్ట్ చేసి గవర్నర్ కు పంపించగా రాజకీయ రంగంలో ఉన్నారనే కారణంతో రిజెక్ట్ చేసింది. దీంతో ఆ రెండు స్థానాలపై బీఆర్ఎస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గవర్నర్ ప్రకటన వచ్చిన మరుక్షణం నుంచే కేసీఆర్ సన్నిహితులతో ఆశావాహులు మంతనాలు స్టార్ట్ చేశారు. బయోడేటాలో ఇప్పటివరకు చేసిన సేవకార్యక్రమాలను పొందుపర్చి అందజేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హడావిడి నేపథ్యంలో టికెట్ రాని వారు ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన డి. రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్ ల పదవీ కాలం ఈ ఏడాది మే 27న ముగిసింది. ఆ తర్వాత జూలై 31న ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సెలెక్ట్ చేసి కేబినెట్ ఆమోదించింది. గవర్నర్ కు ఇద్దరి పేర్లు ప్రభుత్వం సిఫార్సు చేసింది.

అయితే వారిని గవర్నర్ సామాజిక సేవలో కాకుండా రాజకీయరంగంలో ఉన్నారని తిరస్కరించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో మరో ఇద్దరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పటికే టికెట్ కోసం ఆశిస్తున్న ఆశావాహులు పావులు కదుపుతున్నారు. గవర్నర్ ప్రకటన వచ్చిందే తడవుగా మంతనాలు స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ నేతలు సైతం ఇప్పుడు ఎమ్మెల్సీని ఆశిస్తున్నారు. అందుకోసం బయోడేటాలను పార్టీ అధినేత కేసీఆర్ సన్నిహితులకు అందజేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు కేసీఆర్ కు ఫోన్ సైతం చేయిస్తున్నారని పార్టీలోని ఓ నేత పేర్కొన్నారు. ఉద్యోగ సంఘం నేత మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, విద్యావేత్తలు ఘంటా చక్రపాణి, పీఎల్ శ్రీనివాస్, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఓయూ విద్యార్థి నేత రాంనర్సింహాగౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఇలా పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. తమసేవను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని ఆశిస్తున్నారు.

ఎన్నికల సమయంలో హడావిడి..

అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల రెండో వారం ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నదనే ప్రచారం ఊపందుకుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ తరుణంలోనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తిరస్కరించడంతో ఎమ్మెల్యే టికెట్ రాని ఆశావాహులు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్‌లో ఇటు ఎమ్మెల్యే, అటు ఎమ్మెల్సీ ఆశావాహుల సందడి నెలకొంది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులగా ఎవరిని ఎంపిక చేస్తారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed