- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రికి రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలి!
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిరంకుశ నిజాంను గజ గజ వణికించి, రాచరిక పాలనకు చరమ గీతం పాడిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు , పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిరంకుశ నిజాంను గజ గజ వణికించి, రాచరిక పాలనకు చరమ గీతం పాడిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు , పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్ నగరంలో ఆ మహా నాయకుడి విగ్రహాం ఏర్పాటు చేయడంతో పాటు ఎల్‌బి నగర్ ప్రాంతం నిర్మిస్తున్న కొత్త టిమ్స్ ఆసుపత్రికి రావి నారాయణరెడ్డి పేరు పెట్టి సముచిత గౌరవం కల్పించాలని ప్రభుత్వానికి విజప్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చి ఈ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరులపేర మ్యూజియం ఏర్పాటు చేసి వారి చిత్ర పటాలను అందులో పొందుపర్చాలని కోరారు. తెలంగాణ అమరవీరుల సార్మక ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట రథసారధి, స్వాతంత్ర సమర యోధులు పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డి 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ హోమ్ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.జానారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ జాతీయకార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరామ్, బీఆర్ఎస్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ట్రస్టు సభ్యులు సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, రావి ప్రతిభ, ట్రస్ట్ కోశాధికారి ఉజ్జని రత్నాకర్ రావులు పాల్గొన్నారు. ముందు అతిథులు రావి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి జానారెడ్డి మాట్లాడుతూ రావి నారాయణరెడ్డి కమ్యూనిస్టు నాయకుడే కాదని మానవత్వం మూర్తిభవించిన గొప్ప గాంధేయవాది కూడా అని అన్నారు. రావి నారాయణ రెడ్డి దున్నేవాడేకి భూమి అని నినాదం ఇవ్వడమే కాదు, తనకున్న 500 ఎకరాల భూమి పేదలకు పంచడం ద్వారా భూదాన ఉద్యమానికే స్ఫూర్తి ప్రదాతగా ఆయన నిలిచారని కీర్తించారు. రావి నారాయణ రెడ్డి అశయాలను పార్టీ శ్రేణులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రావి నారాయణరెడ్డి రజకార్లకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్కన నిలబడి సాయుధ పోరాటం ఆధ్యుడిగా ఉద్యమం సాగించిన ఆయన సాహసాన్ని నల్లగొండ జిల్లా నే కాదు, దేశం మొత్తం కూడా మరిచిపోదన్నారు. యువతకు అవకాశం కల్పించాలని తద్వారానే పార్టీ మరింత బలోపేతం అవుతుందనిభావించి 60 ఏళ్లకే ప్రత్యేక్ష రాజకీయలను నుంచి నిష్క్రమించారని, కొంత ఆలస్యమైనా ఆయన సూర్తితోనే తాను కూడ ప్రత్యేక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నానని జానారెడ్డి తెలిపారు.
తల కిందుల తపస్సు చేసినా కమ్యూనిజాన్ని ప్రధాని మోడీ ఆపలేరు : సీపీఐ జాతీయకార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
నాడు తెలంగాణ రైతాంగ పోరాటంతో కమ్యూనిస్టులు నిజాం రాజు పీచం అణిచి తరమి వేస్తున్న చివరి క్షణంలో దీనిని అదునుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పోలీసు యాక్షన్ పేరుతో స్వాధీనం చేసుకుందే తప్ప ఆ విజయం కమ్యూనిస్టులదేనని సీపీఐ జాతీయకార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు తల కిందుల తపస్సు చేసినా కమ్యూనిజాన్ని ఆపలేరన్నారు. మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించగలరేమో గాని కమ్యూనిస్టుల సిద్దంతాన్ని ఆపడం వారి తరం కాదన్నారు. ఎంతో ముందు చూపు ఉన్న రావి నారాయణరెడ్డి 90 ఏళ్ల క్రితమే దళితులకే పాఠశాలలు ఏర్పాటు చేసి ఊరి బయట ఉన్న దళితులను ఊరి లోపలికి తెస్తే నేటి బీజేపీ ప్రభుత్వం వారిని తిరిగి ఊరి బయటకు పంపిస్తూ నయా సనాతన ధర్మం అంటున్నారని నారాయణ పేర్కొన్నారు.
కమ్యూనిజాన్ని కేసీఆర్ హైజాక్ చేస్తారు: ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు
కమ్యూనిస్టు పార్టీలన్ని తిరిగి ఏకం కావాలని మరోసారి కోరుతున్నానని ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు అన్నారు. నాటి కమ్యూనిస్టు నాయకులు అందించిన వారసత్వాన్ని అందిపుచ్చుకుని వారి అడుగు జాడల్లో నడుస్తుండడంతోనే కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లుగా సజీవంగా ఉందన్నారు. అయితే కమ్యూనిస్టులు చీలిపోవడంతో సీపీఐగా అనుకున్న లక్ష్యాన్ని సాధించకలేకపోతున్నామని సాంబశివరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రభావంతోనే ఇదే ఆడిటోరియంలో నాడు సమావేశాలు నిర్వహించి ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తెలివైనవాడని కమ్యూనిస్టులను గౌరవించరు కానీ, ఆయనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం కమ్యూనిజాన్ని మాత్రం హైజాక్ చేస్తారన్నారు. కమ్యూనిస్టులను అణిచివేయడంలో అన్ని పార్టీలు ఎవరి పాత్ర వారు పోషించారని, అయితే గొప్ప మానవతా వాది, విశ్లేషకుడైన రావి నారాయణరెడ్డి నాడు జరుగుతున్న పరిణామాలను గమనంలోకి తీసుకుని సాయుధ పోరాటం విరమణకు పిలునిచ్చారన్నారు. ఈ గొప్ప నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల మ్యూజియం ఏర్పాటు చేయాలని కూనంనేని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ఏక కాలంలో సామాజిక, ఆర్ధిక సమానత్వం, రాజకీయస్వేచ్చ కోసం సాగించిన సాయుధ పోరాటం వల్ల నాటి నిజాం గద్దే దిగినప్పటికీ ఆ తర్వాత మాత్రం జరిగిన పరిణామాలు ఆశించినట్లు ముందుకు సాగలేదన్నారు. సాయుధ పోరాట విరమణ తర్వాత రావి నారాయణ రెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపి సామాజిక, ఆర్ధిక మార్పులకు పూనుకోవాలని ఆయన చేసిన ప్రతిపాదన ముందుకు సాగి ఉంటే ఈ రోజు పరిస్థితులు ఏలా ఉండేవనేది ఉహకు అందని విషయమని పేర్కొన్నారు. ఒకవేళా చర్చల ద్వారా హైదరాబాద్ విలీనం జరిగి ఉంటే ఇంకో విధంగానైన ఉండేంది కాని,అటు ఇటు కాకుండా ఒక వక్ర గతిలోనే హైదరాబాద్ విలీనం జరిగిందని కోదండ రాం వ్యాఖ్యానించారు. దాని వల్ల జరిగిన పరిమాణాలు ఆ తర్వాత సమాజంపై కూడ చాల ప్రభావం చూపాయని తెలిపారు. తెలంగాణలో ఏ ఉద్యమం జరిగిన ఏక కాలంలో సామాజిక, ఆర్ధిక , రాజకీయ సమానత్వాన్ని కోరుకున్నాయని, అవే ప్రజాస్వామ్యానికి పరిపుష్టత చేకూర్చగలుతాయన్నారు. ఆలాంటి ఉద్యమాలను నడిపి నాయకులు చరిత్ర అందరికి తెలియాల్సిన అవసరముందని ఇందకు వారి చరిత్రతో కూడిన చిన్న చిన్న పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా సీనిమా హిరో , హిరోయిన్ల బయో పిక్ వస్తున్నాయని, రావి నారాయణరెడ్డి లాంటి మహాయోధుల బయో ఫిక్‌లు కూడా రావాల్సిన అవసరముందని తద్వారా యువతకు స్పూర్తిదాయకంగా ఉంటుందని కోదండరాం అన్నారు.
బోయనపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. నాటి తెలంగాణ రైతాంగ సాయుధు పోరాట రథసారధి రావి నారయణ రెడ్డి సూర్పితోనే ఆయన పేరు మీద ఉన్న ఇదే ఆడిటోరియం నుంచి తెలంగాణ మలి దశ ఉద్యమానికి అంకురార్పణ జరగడమే కాకుండా ఆ లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. సమాజం ముందుకు వెళ్లే సందర్భంలో అనేక మార్పులు సహజమని, పరిస్థితులకు అనుకూలంగా శాస్త్రీయ దృకత్పదంతో ముందుకు సాగాలన్నారు. మతోన్మాద శక్తులు విజృభిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 75 కోట్లమంది 25 ఏళ్ల లోపు యువతే ఉన్నారని వారంతా ఏమి తెలియని వయస్సువారన్నారు. అలాంటి వారికి మార్గదర్శకం చూపడమే అది రావి నారాయణరెడ్డి లాంటి మహానాయకులకు నిజమైన నివాళి అవుతుందన్నారు. సమాజ మార్పు కోసం కృషి చేసిన పెద్దల జయంతులు, వర్ధంతులు జరుపుకోవడం ద్వారా వారి భావాలను, గౌరవించుకోవడమే నూతన మార్గాలను అన్వేషించుకునేందుకు ఉపయోగపడుతుయని తెలిపారు. నిజాం కాలంలో ఆంధ్ర, తెలంగాణ అని ప్రజల మధ్య బేధాలు లేవని కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతే ఈ ప్రాంత సమాగ్రాభివృద్దికి నోచుకోకపోవడం వల్లే వ్యతిరేకత వచ్చిందని బోయనపల్లి వినోద్‌కుమార్ గుర్తు చేశారు.






