ఆలయాలకు నూతన శోభ.. భూముల పరిరక్షణకు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్

by Naga Rani Yarlagadda |

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

ఆలయాలకు నూతన శోభ.. భూముల పరిరక్షణకు ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. టెంపుల్ టూరిజంలో భాగంగా దేవాలయాలను అభివృద్ధి చేయడంతోపాటు పలు టెంపుల్స్‌ కు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. సర్వ శ్రేయోనిధి ద్వారా రూ.105.77 కోట్ల వ్యయంతో 340 పనులు మంజూరు చేయగా 50 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 50 శాతంలో కొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. మరికొన్ని పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయి

పనులు, నిధులు ఇలా..

- సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.101 కోట్లు విడుదల చేసింది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలతో పాటు ప్రహరీ గోడ రాతి కట్టడం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమ్మవార్ల జాతరకు 15 రోజుల ముందుగానే పనులు పూర్తి చేయనున్నారు.

- వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రూ.76 కోట్లు కేటాయించారు. వీటిలో రూ.36 కోట్లతో అన్నదాన సత్రం పనులు చేపట్టనున్నారు. దీంతోపాటు దేవాలయ పునర్నిర్మాణం, అన్నసత్రం అభివృద్ధికి హెచ్ఎండీఏ ద్వారా రూ.50 కోట్లు కేటాయించారు. శ్రీ బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధికి మరో రూ.20 కోట్లు మంజూరు చేశారు.

- యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం విమాన గోపురానికి 63 కిలోల బంగారు పూత అవసరముందని అంచనా వేశారు. రూ.43.79 కోట్ల అంచనా వ్యయంతో శ్రీ కంచి కామకోటి పీఠ మార్గదర్శకత్వంలో వేదపాఠశాల స్థాపించాలని నిర్ణయించారు. దీనికోసం రాయగిరి వద్ద 17.35 ఎకరాలను కేటాయించారు. యాదగిరిగుట్టను సందర్శించే భక్తులకు షెడ్లు, డార్మిటరీ హాల్, తాగునీటి సౌకర్యం, ల్యాటేటింగ్ రూమ్‌లు, లాకర్ సౌకర్యాలు పెంచడంతోపాటు ప్రసాదం కౌంటర్లు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, మహిళా భక్తులకు బ్యాటరీ వాహనాలు, తదితర సౌకర్యాలు కల్పించారు.

- వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాడవీధుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎస్డీఎఫ్, కుడా నుంచి ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింది.

- నాగర్‌కర్నూల్ జిల్లాలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (కురుమూర్తి) అభివృద్ధికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఘాట్ రోడ్‌ల నిర్మాణానికి ఎలివేషన్ కారిడార్, కొండపైన భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు వంటి పనులను ఆర్ అండ్ బీ శాఖ ద్వారా చేపట్టారు.

ఎస్డీఎఫ్ నిధులతో..

భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం బృహత్ ప్రణాళిక అమలులో భాగంగా రూ.60.20 కోట్లతో భూసేకరణ ప్రక్రియ పూర్తిచేశారు. కొడంగల్‌లోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేసింది. భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.12.15 కోట్లు మంజూరు చేసింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన 13 పనులు పురోగతిలో ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం (స్థానాల లక్ష్మీపురం) అభివృద్ధికి రూ.3.20 కోట్ల అంచనా వ్యయంతో కళ్యాణ వేదిక, అభిషేక మండపం, డార్మిటరీ హాల్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ముదిగొండలోని గంధసిరి శ్రీ శివాలయం అభవృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. యడవల్లి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కోసం రూ.4.7 కోట్లు కేటాయించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లోని శ్రీ మారుతీ మందిరం (సలాబత్‌పూర్) అభివృద్ధిలో భాగంగా రూ.6.70 కోట్ల అంచనా వ్యయంతో కళ్యాణమండపం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రాకార మండపం, కాంపౌండ్ వాల్, పనులు పురోగతిలో ఉన్నాయి. మహబుబాబాద్ జిల్లాలోని నరసింహులపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం కోసం రూ.కోటి కేటాయించారు. రూ.67 లక్షల వ్యయంతో పనులు పురోగతిలో ఉన్నాయి.

బృహత్ ప్రణాళికలు

బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానం, ధర్మపురిలో లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, కీసరలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టులోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లను రూపొందించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ధర్మకర్తల మండళ్ల ఏర్పాటు

మొదటిసారిగా ప్రభుత్వం ఉత్సవ కమిటీ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటి వరకు వివిధ స్థాయిలలో ఉన్న 443 దేవాలయాలకు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసింది. వీటి పదవీ కాలాన్ని రెండేండ్లకు పెంచింది.

ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్

ఆలయ భూములు పరిరక్షించడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ ద్వారా సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. 632.12 ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నది. 252.35 ఎకరాల భూమిని ఇందిరా మహిళా గ్రూపుల ద్వారా సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నారు. జీఐఎస్ ద్వారా ఎండోమెంట్ భూముల డిజిటలైజేషన్ రక్షణ, ఎండోమెంట్స్ ప్రాపర్టీల ఇన్వెంటరీ, మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నియామకాలు.. బదిలీలు..

వివిధ స్థాయిల్లో గల దేవాలయాల్లో 324 మతపర ఖాళీలను పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించారు. దీంతోపాటు 16 సంవత్సరాల తరువాత శాఖలోని 646 దేవాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులు, ఆలయ పరిపాలన ఉద్యోగులను బదిలీ చేశారు.

నది హారతి

ప్రతి బుధవారం బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో గోదావరి నది హారతి నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ వెల్లడించింది. ప్రతి సోమవారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వరి ఆలయంలో తుంగభద్ర హారతి నిర్వహిస్తున్నారు. పర్వదినాలలో శాఖలోని వివిధ దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. బోనాల జాతర-2025 కోసం రూ.20 కోట్లు మంజూరు చేశారు. 2025లో సామూహిక కార్తీక దీపోత్సవం అన్ని దేవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు.

Next Story