పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం: ఉపాధ్యాయ సంఘాలు

by Bhoopathi Nagaiah |

బడ్జెట్‌లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులుపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, మిడ్డేమీల్స్, బ్రేక్ ఫాస్ట్ వంటి వంటి విషయాలను స్వాగతించారు.

పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం: ఉపాధ్యాయ సంఘాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులుపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, మిడ్డేమీల్స్, బ్రేక్ ఫాస్ట్ వంటి వంటి విషయాలను స్వాగతించారు. మొత్తంగా నిధుల కేటాయింపుల్లో పెండింగ్ బిల్లులు, పిఆర్సీ ప్రస్తావన లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.

జనాకర్షణే తప్ప వాస్తవికత లేని బడ్జెట్ : టీఎస్ యూటీఎఫ్

జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత వ్యవస్థను బాగుచేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని టీఎస్ యూటీఎఫ్ అభిప్రాయపడింది. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆహ్వానించిందగిందే. గత సంవత్సరం కంటే రూ.3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కోసమే సరిపోతాయన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.1056 కోట్లు కేటాయింపును స్వాగతిస్తున్నామని, మరి పీఆర్సీ సంగతేంటని ప్రశ్నించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రూ.1056 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని టీఎస్ యూటీఎఫ్ స్వాగతించింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, బకాయిల గురించి కూడా స్పష్టత ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది.

ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌కు బడ్జెట్ కేటాయింపులు హర్షణీయం: ఎస్టీయూటీఎస్

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రకటించడం, బడ్జెట్ సైతం కేటాయించడం హర్షించదగిన విషయం అని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందం గౌడ్, జుట్టు గజేందర్ పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించిన కొన్ని సానుకూల అంశాలను స్వాగతిస్తున్నామని, మొత్తంగా కేటాయింపులు అవసరానికి తక్కువగా ఉన్నాయని, విద్యారంగానికి బడ్జెట్ మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ స్థాయిలో కొఠారి కమిషన్ సూచించిన 30 శాతం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనబడిన 15 శాతం నిధులతో పోలిస్తే ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. ప్రి-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టడం, జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం, గురుకులాలు, వసతి గృహాల్లో వంటశాలల ఆధునీకరణకు నిధులు కేటాయించడం వంటి నిర్ణయాలను అభినందించారు. ఉపాధ్యాయులకు అమలు చేయవలసిన పీఆర్సీ, నాలుగు డీఏలు, పెండింగ్ బిల్లులు, సమగ్ర శిక్ష, కేజీబీవీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాల పెంపు వంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని అన్నారు.

నామమాత్రపు కేటాయింపులు: టీఆర్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్

బడ్జెట్‌లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి పేర్కొన్నారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ, బడ్జెట్‌లో కనీసం ఐదు శాతం కూడా పాఠశాలల అభివృద్ధికి నిధులు దొరకటం లేదని కమిషన్ ఎత్తి చూపిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 15 శాతం నిధులను విద్యాశాఖకు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ అరకొర నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణ అసాధ్యమని వారు పేర్కొన్నారు. అదే విధంగా పెండింగులో ఉన్న పీఆర్సీ, ఎస్ఎస్ఏ, కేజీబీవీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావనే బడ్జెట్‌లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దశ దిశ లేని బడ్జెట్: తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్

విద్యకు 15 శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ వరుసగా 3వ బడ్జెట్లో కూడా నెరవేరలేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఒడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య పేర్కొన్నారు. అసలు పీఆర్సీ, డీఏ, పెండింగ్ బిల్స్ పై శ్రద్ద లేకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం క్రింద ఉచిత వైద్యం స్వాగతించాల్సిన అంశమే అయినా నిర్ధిష్ట నిధులు సరిపోవన్నారు. ఉచిత పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత విద్యారంగానికి సరైన కేటాయింపులు లేవన్నారు. ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంచిదేనన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ 1056 కోట్లు కేటాయింపును స్వాగతిస్తున్నా అవి దారి మళ్లకుండా చూడాలన్నారు.

Next Story