- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ మద్దతును తిరస్కరించలేదు.. కానీ! సీపీఐ కూనంనేని సంచలన వ్యాఖ్యలు
కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్‌కు సంబంధించి బీఆర్ఎస్ తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందని కూనంనేని తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ తొలిసారి సీపీఐకి రావడంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెం మేయర్, డిప్యూటీ మేయర్‌కు సంబంధించి సీపీఐకి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. బీఆర్ఎస్ మద్దతును తిరస్కరించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో జత కట్టాం కాబట్టి బీఆర్ఎస్ మద్దతు తీసుకోలేకపోయామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉండాలని జాతీయ స్థాయిలో ఉందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ ఒంటరిగా పోటీ చేసిందని తెలిపారు. సీపీఎం కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుందని వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు బలం ఉన్న చోట్ల సీట్లు కాంగ్రెస్‌ను అడుగుతామని అన్నారు. ఇస్తే ఓకే లేకపోతే.. ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేసిందని గుర్తుకుచేశారు.
కమ్యూనిజానికి ఫుల్ స్టాప్ ఉండదు..!
కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్‌కు తొలి మేయర్ సీపీఐ కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. యువకుడు, సామాన్య ఆటో డ్రైవర్‌ను కొత్తగూడెం మేయర్‌ను చేశామని అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో చతుర్ముఖ పోటీ జరిగిందని, సీపీఐ కొత్తగూడెంలో ఒంటరిగా పోటీ చేసిందని మరోసారి చెప్పారు. సీపీఐ 22 కార్పొరేటర్లను గెలిచింది.. సీపీఐ మద్దతు ఇచ్చిన ఒక ఇండిపెండెట్ విజయం సాధించారు.. కమ్యూనిస్టులు పరాన్న జీవులు, ఎక్కడా ఉన్నారని ప్రశ్నించిన బీజేపీ ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు. కొత్తగూడెంలో బీజేపీ ఎక్కడ ఉంది? కమ్యూనిజానికి ఫుల్ స్టాప్ ఉండదు.. కమ్యూనిజం అనేక దేశాల్లో చిగురిస్తుందని అన్నారు. పట్టణాల్లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ 41 స్థానాల్లో విజయం సాధించిందన్నారు.
ఇది పోలీసు రాజ్యమా..?
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని అన్నారు. కనీసం ప్రాతినిధ్యం ఉండేలా నైనా కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు అని చెప్పుకుంటున్న ఎన్నికలు వస్తే పొత్తు కుదరడం లేదన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో నైనా ఆ తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్ చూడాలని హితువు పలికారు. ఎర్ర చొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకున్నారు.. ఇది పోలీసు రాజ్యమా? అని ప్రశ్నించారు. కొత్తగూడెంలో విత్ డ్రా కోసం ఒక సీఐ తుపాకీ గురి పెట్టారు.. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని ఆరోపించారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఊరుకోం అని హెచ్చరించారు.






