కుంభం కీర్తిరెడ్డి చొరవ.. 1550 మందికి ఉద్యోగాలు

by Gantepaka Srikanth |

భువనగిరిలో కుంభం ఫౌండేషన్, వన్ఎంవన్ బీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.

కుంభం కీర్తిరెడ్డి చొరవ.. 1550 మందికి ఉద్యోగాలు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరిలో కుంభం ఫౌండేషన్, వన్ఎంవన్ బీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. చాలా మంది యువత చేతుల్లో నియామక పత్రాలు పెట్టి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది ఈ కార్యక్రమం. వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ యువత వరకు వేలాది మంది ఈ జాబ్ మేళాకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

కుంభం కీర్తి రెడ్డి ప్రత్యేక చొరవ..

ఈ జాబ్ మేళా ఇంతటి భారీ విజయం సాధించడంలో కుంభం ఫౌండేషన్ చైర్‌పర్సన్ కుంభం కీర్తి రెడ్డి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జాబ్ మేళాలో మొత్తం 2600 మంది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1550 మంది యువత ఎంపిక అయ్యారు. ఇందులో 480 నియామక పత్రాలు అందజేశారు.‌ యువతకు కేవలం ఉపాధి చూపడమే కాకుండా, వారిని ఒక క్రమపద్ధతిలో ఇంటర్వ్యూలకు సిద్ధం చేయడంలో ఆమె పర్యవేక్షణ కీలకంగా నిలిచింది. ఈ మేళా ద్వారా మొత్తం 1550 మంది అభ్యర్థులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికై తమ ప్రతిభను చాటుకున్నారు. వీరిలో 480 మంది అభ్యర్థులకు కుంభం కీర్తి రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేసి వారిని అభినందించారు. మరికొంత మందికి ఫైనల్ రౌండ్ పెండింగ్ ఉంది. నిరుద్యోగ యువతకు అండగా నిలవాలనే సంకల్పంతో ఆమె చేపట్టిన ఈ కార్యక్రమం నియోజకవర్గంలో ఆదర్శంగా నిలిచింది.

నైపుణ్యమే ఆయుధం..

ఉద్యోగాల కల్పనతోనే ఆగిపోకుండా, యువతను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలనే సంకల్పం ఈ మేళాలో కనిపించింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యువతకు దిశానిర్దేశం చేస్తూ, నిరంతర నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. ఈ క్రమంలోనే భువనగిరి యువత భవిష్యత్తును మార్చేసే ఒక అద్భుతమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. స్థానిక యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని అనిల్ కుమార్ రెడ్డి ఐబీఎం ప్రతినిధులను కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఈ స్కిల్ సెంటర్ గనుక అందుబాటులోకి వస్తే, భువనగిరి యువతకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ స్థానికంగానే దొరుకుతుంది. ఇది నియోజకవర్గ యువత పాలిట ఒక వరంలా మారనుంది.

యువత భవిష్యత్తే లక్ష్యం: కుంభం కీర్తిరెడ్డి, కుంభం ఫౌండేషన్ ఛైర్ పర్సన్

మెగా జాబ్ మేళాకు యువత నుంచి విశేష స్పందన రావడం చాలా సంతోషం. యువతకు కేవలం ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి స్వయం ఉపాధి దిశగా కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కుంభం ఫౌండేషన్ పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది యువత సరైన మార్గదర్శకం అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి వారికి ఒక వేదిక కల్పించాలనే ఆలోచనతోనే ఈ మెగా జాబ్ మేళా నిర్వహించాము.

Next Story