బ్రేకింగ్.. వీడిన కూకట్‌పల్లి బాలిక మర్డర్ కేసు మిస్టరీ.. అతడే నిందితుడు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-22 12:13:24  IST  )

నాలుగు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన సహస్ర కేసులో మిస్టరీ వీడింది. దొంగతనానికి వచ్చిన టెన్త్ క్లాస్ బాలుడు గొంతుకోసి పరారైనట్లు పోలీసులు తేల్చారు.

బ్రేకింగ్.. వీడిన కూకట్‌పల్లి బాలిక మర్డర్ కేసు మిస్టరీ.. అతడే నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్/కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో నాలుగురోజుల క్రితం.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సహస్ర అనే బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో హంతకులెవరో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. తల్లిదండ్రులు సహా కుటుంబీకులను విచారించినా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసును ఛేదించడం కష్టంగా మారింది. చివరికి సహస్ర తండ్రి కృష్ణపై అనుమానం రాగా.. కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకుంటోన్న ఆయనకు చంపాల్సిన పనేంటని కుటుంబ సభ్యులు ఫైరయ్యారు.

తాజాగా ఈ కేసు మిస్టరీ వీడింది. సహస్రను చంపింది టెన్త్ క్లాస్ చదివే బాలుడని పోలీసులు తేల్చారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రను చంపింది ఆ బాలుడేనని పోలీసులు చెప్తున్నారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారి అనుమానం బలపడింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన పదో తరగతి బాలుడు.. సహస్ర గొంతుకోసి పరారైనట్లు తెలుస్తోంది. సహస్రపై కూర్చుని గొంతునులిమి, ఆపై బ్రతికి ఉందేమోనన్న అనుమానంతో కత్తితో గొంతు కోసినట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సహస్ర బ్రతికి ఉండకూడదనే విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు సమాచారం. దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందే.. ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపై ఒక పేపర్‌పై రాసుకుని దానినే అమలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంటిలో నుంచి రూ.80 వేలు తీసుకుని పరారవుతుండగా సహస్ర అడ్డుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.

నిందితుడు సహస్ర ఇంటి పక్కన ఉన్న భవనంలోనే ఉంటాడని తెలిపారు. సహస్ర హత్య వెనుక దొంగతనమే కారణమా లేక మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం బాలుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. కాగా.. బాలుడు దొంగతనానికి వెళ్లే ముందు రాసుకున్న ప్లాన్ పేపర్ వైరల్ అవుతోంది. ముందు సహస్ర ఇంట్లోకి వెళ్లి టేబుల్ పై గ్యాస్ సిలిండర్ ఉంచాలి. ఆ తర్వాత డబ్బులు దొంగతనం చేయాలి. నెక్స్ట్ గ్యాస్ లీక్ చేసి, డోర్ కి లాక్ పెట్టి వచ్చేయాలి. అని ఆ బాలుడు ప్లాన్ రాసుకున్నాడు. కానీ.. దొంగతనం చేసి వెళ్తుండగా సహస్ర అడ్డుకోవడంతో థెఫ్ట్ ప్లాన్ కాస్తా మర్డర్ గా మారింది.

Next Story