- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక
రేవంత్ అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని తమ పార్టీపైన, మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపైన కడుపులో కొండంత విషం పెట్టుకున్నారని.. రాత్రికి రాత్రి మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను ముంచెత్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని తమ పార్టీపైన, మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపైన కడుపులో కొండంత విషం పెట్టుకున్నారని.. రాత్రికి రాత్రి మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను ముంచెత్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన అంశంపై అన్ని అబద్ధాలు వల్లె వేశారని, తన అవినీతి ప్రణాళికలను, కుట్రలను ప్రజల ముందు ఉంచారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను గాలికొదిలేసి మూసీ ప్రక్షాళన పేరిట లక్షన్నర కోట్ల లూటికి రేవంత్ తెరలేపారని ఆరోపించారు. మూసీని ఆనుకొని నివసించే లక్ష మందికి పైగా ప్రజల ఇళ్లను కూల్చి త్వరలోనే వారిని రోడ్డున పడేస్తామని అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు అంటే కూల్చివేతలు తప్ప నిర్మాణాలు కాదని మరోసారి తేలిపోయిందని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. కలుషితమైన మూసీ కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచే ఎక్కువ కంపు కొడుతున్నదని ధ్వజమెత్తారు.
మూసీలో మూటల వేట..
ఓవైపు 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టి, ఇప్పటికిప్పుడు బ్యూటిఫికేషన్ చేపట్టాలనుకోవడం వెనక అసలు ఉద్దేశం మూసీలో మూటల వేట మాత్రమే అని కేటీఆర్ వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీకి కేంద్రంగా మారుస్తాననడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి మరి డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్‌డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ తయారీ కాంట్రాక్టును మెయిన్ హార్ట్‌కు అప్పగించడం వెనక భారీ దోపిడీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరిధిలో అనేక మంది మంత్రులు అక్రమంగా కట్టిన గెస్టు హౌజుల్లో ఏ ఒక్కదాని వైపు కన్నెత్తి కూడా చూసిన పాపాన పోని ముఖ్యమంత్రి, పేదల ఇళ్లను మాత్రం కనీస కనికరం లేకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.
ముందుగా ముక్కు నేలకు రాయాలి
గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తామని చెబుతున్న సీఎం రేవంత్ ముందుగా అవి కాళేశ్వరం నీళ్లా కాదా చెప్పి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి పేద, మధ్యతరగతి ప్రజలను బలవంతంగా వెల్లగొట్టి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న విలువైన భూములను తన అనుయాయులకు, బీనామీలకు కట్టబెట్టే కుట్ర కొనసాగుతున్నదని ఆరోపించారు. పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని, రెండేళ్ల నుంచి మూసీ చుట్టుపక్కల ఉన్న భూములను ఎలా కబళించాలని మాత్రమే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో తాము బుల్‌డోజర్లకు అడ్డుపడి బాధిత ప్రజలతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు. అయితే.. మళ్లీ మూసీ ప్రాంత ప్రజలను కాటు వేసేందుకు రేవంత్ చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే అతితక్కువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. డిజైన్లు సిద్ధంగా ఉండగా మళ్లీ ఎందుకు మొదటినుంచి ప్రక్రియ చేపడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓసారి 50వేల కోట్లు అని, మరోసారి 75వేల కోట్లు అని, ఇంకోసారి లక్షన్నర కోట్లు అని ప్రాజెక్టు చేపట్టకముందే అంచనాలు పెంచుతున్న రేవంత్ సర్కారు, చివరికి ఈ కుంభకోణానికి ఎన్ని లక్షల కోట్లకు తీసుకెళుతుందో లెక్కే లేదని మండిపడ్డారు. ప్రజాధనాన్ని లూటీ చేసే కాంగ్రెస్ సర్కారు అవినీతి బాగోతాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎక్కడికక్కడ ఎండగడతామని హెచ్చరించారు.






