కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

పార్టీ మారిన వారిపైన పార్టీ తరఫున వేసిన కేసును కూడా నేడు ఫాలో అప్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ మారిన వారిపైన పార్టీ తరఫున వేసిన కేసును కూడా నేడు ఫాలో అప్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మా పార్టీ నేతల బృందం న్యాయవాదులతో సమావేశమవుతుందని వెల్లడించారు. ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటుపడేలా కోర్టులో కొట్లాడుతామని వెల్లడించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan), నితిన్ గడ్కరీ(Nitin Gadkari)లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు కలిశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దేశ పౌరులు విజయవంతంగా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం దేశంలోని యూనివర్సిటీలే అని చెప్పారు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధితో పాటు అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఐఐటీ వంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు యూజీసీ నిబంధనలో తేవాలనుకుంటున్న మార్పులపైన మా పార్టీ డిమాండ్లను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి తెలియజేశామని వెల్లడించారు.

దేశంలో రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ నియామకానికి వేసే సర్చ్ కమిటీలకు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్రం తీసుకురానున్న యూజీసీ నిబంధనలపైన ధర్మేంద్ర ప్రధాన్‌కి కూలంకషంగా వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలియజేసినట్లు వెల్లడించారు. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే ఒక నిబంధనను తీసుకురావడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కాకుండా అభ్యర్థులు దొరకలేదని సాకుతో ఆ ఉద్యోగాలు ఇతర కేటగిరీలను భర్తీ చేసే ప్రమాదం ఉందన్నారు. ఇది ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హక్కును హరించడమేనని తెలిపారు. యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీలో కేవలం విద్యార్హతలపైన మాత్రమే కాకుండా పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని హక్కులను హరించకుండా యూజీసీ నూతన నిబంధనలను రూపొందించాలని కోరినట్లు స్పష్టం చేశారు.

మిడ్ మానేరుపై రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విజ్ఞప్తి మేరకు మా పార్టీ తరఫున.. సిరిసిల్ల వరకు నిర్మాణమవుతున్న జాతీయ రహదారి 365-బీని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసినట్లు వెల్లడించారు. మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిను ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారిని 63 కలిపేలా విస్తరించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

Next Story