CM రేవంత్‌కు రెండు విషయాల మీద పూర్తి అవగాహన ఉంది: కేటీఆర్

by Gantepaka Srikanth |

ఉరిశిక్షల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మాట తప్పిన హామీలకు లెక్క వేస్తే కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

CM రేవంత్‌కు రెండు విషయాల మీద పూర్తి అవగాహన ఉంది: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉరిశిక్షల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మాట తప్పిన హామీలకు లెక్క వేస్తే కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నదీ జలాలపై కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా తెలంగాణకు చేస్తున్న ద్రోహాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి బీఆర్ఎస్ తరఫున ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌‌లో కేటీఆర్ మాట్లాడారు. అశోక్‌నగర్ అడ్డా మీద రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్‌గాంధీపై, రైతు రుణమాఫీ హామీ అమలు చేయని వరంగల్‌లో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ తప్పించినందుకు కామారెడ్డిలో రేవంత్, రాహుల్‌ను ఉరితీయాలని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలు తీర్పు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. 420 హామీల ఎగవేతకు 420 సార్లు కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షించాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి తిట్టడం తప్ప మరో భాష రాదని, తాము కావాలంటే మూడు నాలుగు భాషల్లో సమాధానం చెప్పగలమని అన్నారు. ఐఐటీకి, ట్రిపుల్ ఐటీకి తేడా తెలియదని, బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియని అజ్ఞానం ఉన్న వ్యక్తి తెలంగాణ భవితవ్యంపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దౌర్భాగ్యమని అన్నారు. అలాంటి వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుందన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని, ఉష్ట్రపక్షి పాలన ఇది అని అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ వల్లే నదీ జలాల్లో అన్యాయం

నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం కాంగ్రెస్, టీడీపీ వల్లే జరిగిందని కేటీఆర్ అన్నారు. నిజాం కాలం తర్వాత 65 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ఆపై 17 ఏళ్ల చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ పాలనలోనే ఈ ద్రోహం జరిగిందని గుర్తుచేశారు. 2014 వరకు రాష్ట్రాన్ని నిరాటంకంగా పాలించిన కాంగ్రెస్, టీడీపీలే ఈ అన్యాయాలకు పూర్తిబాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని ఎలా సరిచేయాలనే ప్రయత్నాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసిందో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందుంచామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతత, అహంకారం, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు నిరంతరం ఎండగడుతామని స్పష్టం చేశారు.

అధికార మదంతో విర్రవీగుతున్నరు..

శాసనసభలో జరుగుతున్న చర్చల తీరును, ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న సీఎం మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత పెద్దలు చెప్పిన మాట ‘వినాశకాలే విపరీత బుద్ధి’ గుర్తుకు వస్తున్నదని కేటీఆర్ అన్నారు. అధికార మదంతో విర్రవీగుతూ, అహంకారంతో, పరుషమైన మాటలతో మాట్లాడటం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. పదేపదే చావు, ఉరిశిక్షలు అంటూ మాటలు అనడం దుర్మార్గమన్నారు. నదీ జలాలపై చర్చ పెట్టిన సీఎంకు అసలు బేసిన్ల అర్థమే తెలియదని విమర్శించారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉన్నదో కూడా తెలియని వ్యక్తి ఇరిగేషన్‌పై ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరమన్నారు. వడ్డేపల్లి పంప్ హౌస్ మునిగిపోయినా చర్యలు లేవని, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలి ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినా ఇప్పటికీ శవాలను వెలికి తీయలేదని అన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినప్పుడు నిర్మాణ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని అధికారులే సూచించినా పట్టించుకోలేదన్నారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలే తప్ప అభివృద్ధి లేదన్నారు. పేదల ఇళ్లను కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్, సర్వే సర్వత్రా విఫలమైన సర్వభ్రష్ట ప్రభుత్వం ఇదేనని, అలాంటి ప్రభుత్వానికి అధినేతగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు.

Next Story