‘కంటికి రెప్పలా కాపాడుకుంటాం’.. కేటీఆర్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

‘కంటికి రెప్పలా కాపాడుకుంటాం’.. కేటీఆర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ NDA ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్‌ఏకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు “పోలవరంను.. కూలవరం” అనే దమ్ము ధైర్యం ఉందా? అని అడిగారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే NDSAను దించి బీఆర్ఎస్‌పై బురజల్లిన బీజేపీ నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారు? అని అన్నారు.

ఏకంగా 10 అడుగుల వెడల్పు.. 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్‌ను గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్‌కు దిక్కులేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే అని సీరియస్ అయ్యారు. 2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఊలుకూ లేదు, పలుకూ లేదు. మరోసారి ఏపీలో పోలవరం కాఫర్ డ్యామ్ గోదావరిపాలైనా, ఇటు తెలంగాణలో ఎస్.ఎల్.బీ.సీ. టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్.డీ.ఎస్.ఏ అడ్రస్ లేదని విమర్శలు చేశారు. పంజాబ్‌నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుపై Congress - BJP పార్టీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం.. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story