కుట్రలు కూలాయి.. కాళేశ్వరం గెలిచింది: హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

కుట్రలు కూలాయి.. కాళేశ్వరం గెలిచింది: హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలు, రైతులు గెలిచారని.. రాజకీయ రాబందులు, పిట్టల దొరల కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. హైకోర్టు తీర్పుతో కూలింది కాళేశ్వరం కాదు.. ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలు కూలిపోయాయి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఈ తీర్పుతో స్పష్టమైందని అన్నారు. ఇది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. 'పీసీసీ' (కాంగ్రెస్) నివేదిక అని తాము అప్పుడే చెప్పామని గుర్తు చేశారు. మేడిగడ్డ కుంగడం వెనుక పెను కుట్ర దాగి ఉందని, అది కచ్చితంగా కాంగ్రెస్ పనే అయి ఉంటుందని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే విశ్రాంత జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ చరిత్ర అజరామరం..

తెలంగాణ నేలపై గోదావరి జలాలు పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని, ఇవాళ రాష్ట్రంలో పారుతున్న ప్రతి నీటి బొట్టుకు కారణం కేసీఆరేనని కొనియాడారు. రూ.94 వేల కోట్లతో ప్రాజెక్టు కడితే.. రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్, బీజేపీలు సిగ్గువిడిచి విష ప్రచారం చేశాయని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీపై పెట్టిన ఖర్చు కేవలం రూ.3,800 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మేడిగడ్డ అంటే కుంగిన గడ్డ కాదు.. అది తెలంగాణకు 'మేటి గడ్డ', 'నీటి గడ్డ' అని ఆయన అభివర్ణించారు. భూమి ఉన్నంత వరకు కాళేశ్వరం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేలుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలిపి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. తప్పుడు పని చేసిన వారు ఎవరైనా ఊరుకునేది లేదని హైకోర్టు తీర్పుతో తేలిపోయిందని ఆయన అన్నారు.

Next Story