- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామ్రేడ్ల పోరాట పటిమ స్ఫూర్తిదాయకం: కేటీఆర్ ప్రశంసలు
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్‌కు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికీ లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు కేటీఆర్ సెల్యూట్ చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సీపీఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం. అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చిచెప్పింది. రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయి. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగునా విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.






