తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిపై కేటీఆర్ జోస్యం

by Gantepaka Srikanth |

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిపై కేటీఆర్ జోస్యం

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిపై కేటీఆర్ జోస్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ డెవలప్‌మెంట్ కోసం కాంగ్రెస్‌లో చేరినట్టు చెబుతున్నారు. ఎవరి డెవలప్మెంట్ కోసం వెళ్లారో అందరికీ తెలుసు. మరో రెండేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సంగతి తెలుసు.. ఫహీ సంగతి తెలుసు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు అంజిబాబు, పల్లవి దంపతులు ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అందరి జాతకాలు తమకు తెలుసని.. సుల్తాన్‌పూర్ బయటకు వస్తుందని.. ఘన్సిమియాగూడ బయటకు వస్తుందని హెచ్చరించారు. ఎవరెవరిని ఏం చేయాలో.. ఎవరెవరి సంగతి ఎలా చెప్పాలో.. ఎవరెవరి బెండు ఎలా తీయాలో అన్నీ తెలుసని అన్నారు. ఒకసారి అడ్డిమారి గుడ్డిదెబ్బకు గెలిస్తే ఇంతలా ఎగిరితే ఎలా అని ప్రశ్నించారు. మరోసారి కేసీఆర్ తెలంగాణకు సీఎం అవుతారని, పాలన పట్టాలెక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విశ్వసనీయతకు పరీక్ష

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పాలన, శాంతిభద్రతలు, ప్రభుత్వ విశ్వసనీయతకు పరీక్షగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పెద్ద ప్రాజెక్టులను నిలిపివేస్తూ, ప్రజలపై బుల్డోజర్లను ప్రయోగించిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పనితీరుకు పరీక్షగా నిలుస్తాయని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాటకాలను నమ్మకుండా, 420 గ్యారంటీల పేరుతో చేసిన మోసాన్ని గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో బుల్డోజర్ రాజ్ వచ్చిందని, పరిపాలనపరమైన సంపూర్ణ వైఫల్యం కొనసాగుతున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్య పరిపాలన అని అన్నారు. ప్రజలకు పనికి వచ్చే ఒక్క కార్యక్రమం చేపట్టకుండా కేవలం ప్రచారం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను పూర్తిగా మోసం చేసిందని అన్నారు. ఎలాంటి హోంవర్క్ లేకుండా రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని, చివరికి కాంగ్రెస్ పార్టీ మోసాన్ని కోర్టు ఎండగట్టిందని అన్నారు. నిజంగానే బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ పార్టీకి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, వారి ఎంపీలు తెలంగాణ గల్లీలో దొంగ పోరాటం చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేలా ప్రయత్నం చేయాలని సవాల్ చేశారు.

టెండర్ల నుంచి మొదలుకొని బిల్లుల వరకూ కమీషన్లు

కేవలం మేడారం జాతర పనుల వివాదాల గురించి మాత్రమే కాకుండా టెండర్ల నుంచి మొదలుకొని బిల్లుల విడుదల వరకు ప్రతి సందర్భంలోనూ కమీషన్ల కోసమే కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు కొట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ అటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ అంశంపై స్పందించకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయాల్సిన కేబినెట్ సమావేశంలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ, వాటాల కోసం కొట్లాడుతుంటే పరిపాలన ఎవరు చేస్తారని, పట్టించుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు ఉన్న ప్రాంతాలను పక్కనపెట్టి, భవిష్యత్తు లేని ఫ్యూచర్ సిటీ వైపు అడ్డగోలు సొమ్మును ఖర్చు పెట్టేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని.. కేవలం ఫ్యూచర్ సిటీలో ఉన్న తమ భూములకు మరింత రేటు వచ్చేలా ప్రజల సొమ్ముతో వేరే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా అన్ని రంగాల్లో ప్రజల జీవితాల్లో దుర్మార్గమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రస్తుతం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తుందని అన్నారు. మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌, మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, మాజీ పెద్దషాపూర్ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, 2018 జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి అంజిబాబు దంపతులు తదితరులు పార్టీలో చేరారు.

Next Story