మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదు.. కేటీఆర్ తరపు న్యాయవాదులు

by Gantepaka Srikanth |

ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని, గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులూ ఇవే స్పష్టం చేస్తున్నాయని న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు.

మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదు.. కేటీఆర్ తరపు న్యాయవాదులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని, గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులూ ఇవే స్పష్టం చేస్తున్నాయని న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న విచారణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించినదని.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికారుల యంత్రాంగం ద్వారా సాగిందని పేర్కొన్నారు. ఇందులో కేటీఆర్ నిర్ణయానికి మినహా వ్యక్తిగతంగా పరిమిత పాత్ర మాత్రమే వహించారని తెలిపారు. ఫార్ములా ఈ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదని న్యాయవాదులు స్పష్టం చేశారు.

ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలతోపాటు ఆయా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదని తెలిపారు. ఇవన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సమయంలో కేవలం రాజకీయ వేధింపుల కోణంలో మొబైల్ ఫోన్ అడగడం వెనుక న్యాయసమతమైన కారణాలు లేవని న్యాయవాదులు పేర్కొన్నారు. విచారణ సంస్థలు ఒక పౌరుడి నుండి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని పేర్కొన్నారు. గతంలో హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని న్యాయవాదులు గుర్తుచేశారు.

పైగా వ్యక్తిగతంగా వాడే ఫోన్లను ఎలాంటి కోర్టు తీర్పు లేకుండా, వాటితో నేరుగా ఆరోపణల సంబంధం లేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతేకాక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం, ప్రైవసీ హక్కులకు విఘాతం కలిగించేలా ఉంటుందని తెలిపారు. ఈ చట్టాల ప్రకారం కేవలం కోర్టు తీర్పు ఉన్నప్పుడు మాత్రమే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్‌టాప్ లాంటి పర్సనల్ డివైసులు అడగవచ్చని వివరించారు. అంతేకాక, ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవని పేర్కొన్నారు. ఎటువంటి నిధుల దుర్వినియోగం లేకుండా, స్కాం లేని పరిస్థితిలో ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతున్నదని స్పష్టంగా పేర్కొన్నారు.

Next Story