- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే మాకూ ఓకే
ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నేను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నా.. ఫార్ములా ఈ కార్ రేసు కేసు ముమ్మాటికీ లొట్ట పీసు కేసే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి ఫార్ములా కేసు చార్జిషీట్ తెచ్చారని ఆరోపించారు. సీఎం సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని తాము బయటపెట్టడంతో సర్కారు పూర్తిగా ఇరకాటంలో పడిందన్నారు. ఈ కేసులో ఏమీ లేదని ప్రభుత్వమే చార్జిషీట్‌లో ఒప్పుకున్నదని.. ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన రూ.45 కోట్ల నిధులు అక్కడి బ్యాంకు అకౌంట్‌లో భద్రంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ నుంచి పంపిన నిధులు ఎక్కడా దారి మళ్లలేదని తెలిపారు. ఇక్కడి నుంచి రూ.45 కోట్లు పంపితే రూ.600-700 కోట్లని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసలు ఈ కేసులో ఎవరికి అనుచిత లబ్ధి చేకూరిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నదో వారి పేరే చార్జిషీట్‌లో లేదన్నారు. ఈ కేసు కోర్టులో నిలబడదని వెల్లడించారు. సంస్థ ఖాతాలో భద్రంగా ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి తెప్పించవచ్చు కదా అని సూచించారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ప్రతిష్టాత్మక రేసును నగరానికి తీసుకువచ్చామన్నారు. ఈ రేసు వల్ల వారం రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.700 కోట్ల ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి కలిగిందని నీల్సన్ అనే సంస్థ స్పష్టం చేసిందని తెలిపారు.
అందాల పోటీలతో అప్రతిష్టపాలు..
అందాల పోటీలు పెట్టడం వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం జరగలేదని.. పైగా అంతర్జాతీయంగా తెలంగాణ అప్రతిష్ట పాలైందని కేటీఆర్ ఆరోపించారు. తనను లైంగికంగా వేధించారని మిస్ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. అంత దారుణం జరిగినా ప్రభుత్వం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. సీఎం సరదా ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు వృథా చేసిందని తెలిపారు. ఈ రెండు వ్యవహారాల్లో ఎవరిపైనా ఎలాంటి కేసు పెట్టలేదన్నారు. తనపై రాజకీయ కక్షతో అధికారులను వేధించడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్ కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మూసీ అభివృద్ధిపై ప్రణాళిక లేకుండా ముందుకు పోతున్నదని.. కేవలం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వాళ్లు పైసలు ఇస్తారనే ముందుకు పోతున్నదని చెప్పారు. భయకంపితలైన ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరపాలని.. ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని సూచించారు. డీలిమిటేషన్ అనేది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే జరగాలని.. ఇప్పుడు జరిగినా స్వాగతిస్తామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. అసెంబ్లీ సీట్లు పెంచితే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉండటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. టీడీఆర్ అనేది అతిపెద్ద కుంభకోణమని.. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు టీడీఆర్‌ను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ భారీ స్కామ్‌కి తెరలేపబోతున్నారని స్పష్టం చెప్పారు. బలవంతంగా టీడీఆర్‌లు కొనుగోలు చేసేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు నిర్దేశిస్తూ కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. టీడీఆర్ అంటే తిరుపతిరెడ్డి డెవలప్మెంట్ రైట్స్ అయిపోయాయన్నారు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి ఈ టీడీఆర్ స్కామ్‌ను పూర్తిగా బయటపెడతామని చెప్పారు.






