KTR: తెలంగాణలో ప్రమాదకరస్థాయికి శాంతిభద్రతలు

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

KTR: తెలంగాణలో ప్రమాదకరస్థాయికి శాంతిభద్రతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసమే వాడుతున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్‌లోని ప్రశాంత్‌నగర్‌లో రిటైర్డ్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య అత్యంత దారుణంగా హత్యకు గురవ్వడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఒక యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందని, ఇది సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతా భావానికి అద్దం పడుతున్నదని ఆరోపించారు. నేరాల నివారణ, ప్రజా భద్రతపై దృష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ తీరును విమర్శించే సోషల్ మీడియా గొంతులపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు భారీగా పెరిగినట్లు ఎన్సీఆర్బీ నివేదికలు చెబుతున్నాయని.. ఇది ప్రస్తుత ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. హోం శాఖను సైతం తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రజల ఆస్తిపాస్తులను, ప్రాణాలను రక్షించడంలో, శాంతిభద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజకీయ వేధింపులు ఆపి, పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఎకోసిస్టమ్‌కు నిదర్శనం..

స్కైరూట్ ఏరోస్పేస్ 1 బిలియన్ డాలర్ల విలువను చేరుకోవడం తెలంగాణ పారిశ్రామిక, ఆవిష్కరణల విధానాలకు ఇది ఒక అద్భుతమైన నిదర్శనమని కేటీఆర్ కొనియాడారు. భారతీయ స్పేస్-టెక్ రంగంలో ఒక స్టార్టప్ యూనికార్న్ క్లబ్‌లో చేరడం ఇదే మొదటిసారి అని తెలిపారు. దశాబ్ద కాలంగా హైదరాబాద్‌లో పకడ్బందీగా నిర్మించిన ప్రపంచ స్థాయి ఎకో సిస్టమ్ వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. టీ-హబ్ వంటి వేదికల ద్వారా డీప్-టెక్ ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే దూరదృష్టి వల్లే, ఒక చిన్న ఆలోచనగా మొదలైన స్కైరూట్ ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నదని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీ-హబ్‌లో ప్రారంభమైన తొలి స్టార్టప్‌లలో స్కైరూట్ ఏరోస్పేస్ ఒకటి అని.. ఇంత తక్కువ సమయంలో ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం ప్రైవేట్ సంస్థల వృద్ధిని ఎలా వేగవంతం చేస్తున్నదో చెప్పడానికి ఒక నమూనాగా నిలుస్తుందని కొనియాడారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, టీ-హబ్‌లో ఎదిగిన స్కైరూట్ ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమని.. ఈ విజయం తెలంగాణలో అభివృద్ది చేసిన మొత్తం ఎకోసిస్టమ్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.

Next Story