కేసీఆర్ కిట్‌కు రాహుల్ గాంధీ పేరు పెట్టండి: సర్కార్‌కు కేటీఆర్ సూచన

by Gantepaka Srikanth |

‘గవర్నర్ ప్రసంగంలోనే మీ ప్రభుత్వం ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ఒప్పుకుంది. 2023-24లో 9.46 లక్షల ఉద్యోగాలు ఉంటే, నిన్నటి లెక్క ప్రకారం అవి 9.39 లక్షలకు పడిపోయాయి.

కేసీఆర్ కిట్‌కు రాహుల్ గాంధీ పేరు పెట్టండి: సర్కార్‌కు కేటీఆర్ సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘గవర్నర్ ప్రసంగంలోనే మీ ప్రభుత్వం ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ఒప్పుకుంది. 2023-24లో 9.46 లక్షల ఉద్యోగాలు ఉంటే, నిన్నటి లెక్క ప్రకారం అవి 9.39 లక్షలకు పడిపోయాయి. అంటే మీ ప్రభుత్వం వచ్చాక 7 వేల ఉద్యోగాలు పోయాయి. ఐటీ ఎగుమతులపై కూడా మీరు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కేబినెట్ ఆమోదించిన గవర్నర్ ప్రసంగానికే విలువ లేనప్పుడు, ఈ వ్యవస్థను ఎవరు కాపాడతారు?’ అని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో ఉస్సేన్ బోల్ట్ లా పరిగెత్తిన ఆర్థిక చక్రం ఇప్పుడు అపసవ్య దిశలో తిరుగుతోందన్నారు. ‘తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 6వ స్థానానికి పడేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పతనమైంది. మార్కెట్లో జోరు లేదు.. గిరాకీ లేదు. మీరు తీసుకొచ్చింది నైట్ ఎకానమీ కాదు, దారం తెగిన కైట్ (గాలిపటం) ఎకానమీ’ అని ఎద్దేవా చేశారు.

‘కేసీఆర్ కిట్ పేరు నచ్చకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ పేదలకు అన్యాయం చేయకండి. ఆ కిట్ ను కొనసాగించాలి’ అని అన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల పందేరానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. ‘మేము 16 వేల కోట్లతో మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తే, మీరు 1.5 లక్షల కోట్లతో ఏం చేయబోతున్నారు? ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేయొచ్చు. కానీ మీరు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల కోసం పేదల ఇళ్లను కూల్చుతున్నారు’అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగు వెనుక భూముల బేరం కనిపిస్తోందని, ఫ్యూచర్ సిటీ పేరుతో గ్రాఫిక్స్ మాయాజాలం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘తెలంగాణ అణువణువునా కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నాయి. మీరు కూర్చున్న సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, అసలు తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ గారి ఆనవాళ్లు. వాటిని ఎవరూ చెరిపేయలేరు. హిరణ్యకశిపుడు నారాయణ మంత్రాన్ని నిషేధించినట్లుగా మీరు కేసీఆర్ పేరును నిషేధించాలని చూస్తున్నారు’ అని విమర్శించారు. హిరణ్యకశిపుడు నారాయణ మంత్రాన్ని నిషేధించినట్లుగా మీరు కేసీఆర్ పేరును నిషేధించాలని చూస్తున్నారని విమర్శించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుతో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి వంటి వాళ్లందరూ కూడా తెలంగాణ సాధించిన అద్భుతమైన ఆర్థిక ప్రగతిని గుర్తు చేశారు.

విశ్వసనీయత లేని 'జీరో వాల్యూ' ప్రభుత్వం..

‘గవర్నర్ ప్రసంగం అంటే రాజ్యాంగబద్ధమైనది, ఎంతో పవిత్రమైనది. కానీ ఈ ప్రభుత్వం దాని విలువను తగ్గించేసింది’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అప్పటి గవర్నర్ తమిళసై గారు చేసిన ప్రసంగాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారని చెప్పారు. మరి ఆ ఫైల్ ఏమైంది? ముఖ్యమంత్రి ప్రజల సాక్షిగా బహిరంగ వేదికపై సంతకం చేసిన ఆ ఫైల్ మాయమైపోయింది దీనిపై ప్రత్యేక సిట్ వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను’ అని అన్నారు. ముఖ్యమంత్రి సంతకానికే దిక్కులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని, రేవంత్ రెడ్డి మార్క్ డిక్లరేషన్లకు 'జీరో వాల్యూ' ఉందని ఎద్దేవా చేశారు.

Next Story