KTR: కాళేశ్వరం నివేదిక మొత్తం గ్యాస్.. ట్రాష్

by Gantepaka Srikanth |

దేశ వ్యాప్తంగా బ్యాలెట్ పద్ధతిలోనే అన్ని ఎన్నికలను నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. సోమవారం కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు.

KTR: కాళేశ్వరం నివేదిక మొత్తం గ్యాస్.. ట్రాష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా బ్యాలెట్ పద్ధతిలోనే అన్ని ఎన్నికలను నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. సోమవారం కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్‌లో జరిగే బిహార్ ఎన్నికల్లోనే పేపర్ బ్యాలెట్‌ను ప్రవేశపెట్టి, తరువాత జరిగే సాధారణ ఎన్నికలనూ ఇదే పద్ధతిలో నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంస్కరణలు, ప్రతిపాదనలు, ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చించాలన్న భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు వారితో సమావేశమయ్యామని చెప్పారు. కారు గుర్తును పోలిన గుర్తులతో బీఆర్ఎస్‌కు జరుగుతున్న నష్టాన్ని వివరించి తక్షణమే వాటిని తొలగించాలని కోరినట్టు తెలిపారు. ఇక బిహార్‌లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వస్తున్న అనుమానాలు, కలుగుతున్న ఆందోళనలను తొలగించాలని కోరామన్నారు. 6, 7 విషయాల మీద తమ పార్టీ అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్‌కు చెప్పినట్లు వెల్లడించారు. అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీతోపాటు ఇంకా చాలా దేశాలు ఈవీఎంలతో కొన్ని ప్రయోగాలు చేసి, ఆ తరువాత ప్రజలకు అనుమానాలు రావడంతో ఓటింగ్ మెషిన్లను వద్దనుకుని ఆయా దేశాలు తిరిగి పేపర్ బ్యాలెట్‌కే వెళ్లాయని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని.. 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో దాదాపు వంద కోట్ల ఓటర్లు ఉన్నారని గుర్తుచేశారు. ఇలాంటి దేశంలో మిషన్లతో నష్టం జరుగుతుందని, తమ ఓటు అనుకున్న వ్యక్తికి పోవడం లేదని ప్రజలకు అనుమానాలు వస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు అని తెలిపారు. అందుకే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పక్కనపెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోవాలని తమ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్‌ను కోరినట్లు చెప్పారు.

అడ్డగోలు హామీలపై చర్చించాం..

ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు, అడ్డగోలు వాగ్దానాలపైనా ఎన్నికల కమిషన్‌తో చర్చించామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి 420 హామీలు ఇచ్చి, ఒక వేలం పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక ఎలా తప్పించుకుంటుందో ఎన్నికల సంఘానికి వివరించినట్లు చెప్పారు. వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు ముద్రించి, చివరికి స్టాంపు పేపర్ల మీద సంతకాలు పెట్టి, గుడిలో దేవుడి ముందు బాండు పేపర్లు పెట్టి ప్రజలను ఎలా వంచించారో చెప్పినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోకు కట్టుబడి ఉండకపోతే వారిని శిక్షించే బాధ్యత, అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజల్ని వంచించే ఏ పార్టీ అయినా మోసం చేస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేకుండా అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. చపాతీ మేకర్, రోడ్ రోలర్, షిప్ లాంటి తొమ్మిది గుర్తులతో బీఆర్ఎస్‌కు చాలా నష్టం జరుగుతున్నదని, వాటిని తక్షణమే తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరామన్నారు.

కాళేశ్వరం నివేదిక ట్రాష్

కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్, ట్రాష్ మాత్రమే తప్ప అందులో ఏమీ లేదని కేటీఆర్ మండిపడ్డారు. నివేదికను ఎవరూ చదవక ముందే అడ్డమైన రోత వార్తలను రెండు పత్రికలు రాస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌పై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 655 పేజీల కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే కాంగ్రెస్ భాగోతం అర్థమైందని.. 600 పేజీల్లో వారికి ఇష్టమైనవి లేవని ఆరోపించారు. సాయంత్రం కమిషన్ రిపోర్ట్ వస్తే అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు లీకులు ఇచ్చారని.. తెల్లారి అబద్ధాలను ప్రచారంలో పెట్టారని అన్నారు. దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు పీపీటీ ద్వారా కాళేశ్వరం మీద అన్ని వివరాలను సమగ్రంగా చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో తమ మైకులు కట్ చేయకుండా మాట్లాడిస్తే ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెపుతున్నారో తెలిసిపోతుందని.. కాంగ్రెస్ పార్టీకీ ఆ దమ్ముందా? అని సవాల్ విసిరారు. కాళేశ్వరం, బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి ఫుట్ బాల్ ఆడుతామని హెచ్చరించారు. 42శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తున్నదన్నారు. ఏడాదికి రూ.20వేల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు బడ్జెట్లు పెట్టిన కాంగ్రెస్, రూ.20 వేల కోట్లు కూడా బీసీలకు కేటాయించలేదన్నారు. ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్టులోనైనా 42 శాతం రిజర్వేషన్‌ను ఈ రెండేళ్లలో ఇచ్చారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు.

Next Story