- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలా అయితే గెలవమని రేవంత్‌కు అర్థమైంది: KTR
నిష్పక్షపాతంగా కొట్లాడితే ఓడిపోవడం ఖాయమని రేవంత్‌కు అర్థమైంది. అందుకే దొంగ ఓట్లతో గెలవాలని కుట్ర చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నిష్పక్షపాతంగా కొట్లాడితే ఓడిపోవడం ఖాయమని రేవంత్‌కు అర్థమైంది. అందుకే దొంగ ఓట్లతో గెలవాలని కుట్ర చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని.. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ రావాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర స్టార్ట్ కావాలని అన్నారు. ప్రతి ఇంటికి కేసీఆర్ ఉచిత మంచినీరు ఇచ్చారని.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ పథకాన్ని ఎత్తేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. 4 లక్షల మంది ఓటర్ల వైపు 4 కోట్ల మంది చూస్తున్నారని అన్నారు. పదేళ్ల వికాసానికి.. రెండేళ్ల సంక్షోభానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని.. పదేళ్ల కేసీఆర్ పాలన బాగుండేనా.. రెండేళ్ల రేవంత్ పాలన బాగుందో మీరే తీర్పు చెప్పాలని కోరారు.
విద్యార్థులకు ఉన్నత విద్య దూరం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లకు పైగా సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని.. తద్వారా లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను పొందే హక్కును దూరం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడిన వేలాది కుటుంబాల ఆశయాలను నాశనం చేసి, తెలంగాణ విద్యావంతులైన యువతను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని అన్నారు. మనుగడ కోసం పోరాడుతున్న ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని.. అణగారిన వర్గాల ఆశలను అణిచివేసేందుకు పన్నిన పన్నాగమని ఆరోపించారు. విద్యార్థుల ఫీజులు చెల్లించలేని ముఖ్యమంత్రి, జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం ఏం చేయగలరని ప్రశ్నించారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 420 తప్పుడు హామీలు ఇచ్చిందని, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారని.. వృద్ధులకు రూ.4,000 పెన్షన్, కోడళ్లకు రూ.2,500 భత్యం, యువతులకు స్కూటర్లు, రైతులకు రూ.15,000 సాయం, రూ.2 లక్షల రుణమాఫీ, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఆ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు వంటి అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరా పథకాన్ని కూడా ఆపివేసిందని ఆయన అన్నారు. భార్యలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ భర్తలకు మాత్రం టికెట్ ధరను రెట్టింపు చేశారని ఆరోపించారు. ఇదేనా వాళ్ళు చెప్పే సంక్షేమమని నిలదీశారు.
ఇది కారు, బుల్డోజరుకు మధ్య ఎన్నిక
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ఇనిషియేటివ్ పేరుతో పేదవారి ఇళ్లను కూల్చివేస్తూ, ధనవంతులు, పలుకుబడి ఉన్నవారిని మాత్రం వదిలిపెడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. మురికివాడల్లోని వారి ఇళ్లను కూల్చుతారు కానీ మంత్రులు, కాంట్రాక్టర్ల బంగ్లాలను మాత్రం తాకరని.. ఇదేనా న్యాయమని ప్రశ్నించారు. ఇది సాధారణ ఎన్నిక కాదని.. కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. మోసపోయిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నిక పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల గందరగోళానికి మధ్య జరుగుతున్న పోరాటమని.. తేడా ఏంటో ప్రజలు చూశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్‌తో ముందుకు సాగాలా లేక కాంగ్రెస్‌తో వెనక్కి వెళ్లాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.






