- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి బాటలోనే తనయుడు.. కేటీఆర్ చుట్టూ కోటరీ.. నేతల అసంతృప్తి
తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ సమయంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉండేది. ఎలాంటి నిబంధనలూ అడ్డొచ్చేవి కావు. కానీ.. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలతో పాటు కార్యకర్తలు, చిన్నపాటి లీడర్లకు దూరమయ్యారు. అయితే.. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయి రెండేళ్లు అవుతున్నది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. ఈ సమయంలో అధినేత కేసీఆర్ నిత్యం ప్రజల్లో ఉండి.. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ.. ఆయన మాత్రం పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు. ఏనాడూ ప్రజలను కలిసింది లేదు. కనీసం కలుద్దామంటే ఫాంహౌజ్‌లోకి ఎవరినీ అనుమతించరు. కేవలం పార్టీలోని బడా లీడర్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సామాన్య కార్యకర్తలు.. సెకండ్ కేడర్ లీడర్లకు అక్కడ అసలే అనుమతి లేదు. దీంతో పార్టీ లీడర్లు, కార్యకర్తలు అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది బహిరంగ వాస్తవం.
కేసీఆర్ దారిలోనే కేటీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి అలా ఉంటే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు మరోలా ఉంది. ఆయన సైతం తండ్రిని మించిన తనయుడు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ చుట్టూ ప్రత్యేకంగా ఓ కోటరీ ఉందన్న ప్రచారం పార్టీలో పెద్ద ఎత్తున సాగుతోంది. తన కోటరికి చెందిన వారికే కేటీఆర్ అపాయింట్‌మెంట్ దొరుకుతుందనే టాక్ ఉంది. మిగతా కార్యకర్తలు, నాయకులెవరైనా ఆయన్ను కలవాలంటే ఈ కోటరీని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ అవకాశం సైతం వందలో పది శాతం మందికే లభిస్తుందని పార్టీలో చర్చ ఉంది. కేటీఆర్ సైతం కొద్ది మంది బడా నేతలతోనే ఉంటూ.. వారితోనే సమాలోచనలు చేస్తుంటారని సమాచారం. అందుకే ఆయన నాయకత్వాన్ని పార్టీలోని చాలా మంది లీడర్లు, కింది స్థాయి కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తున్నది. కేటీఆర్‌ను చూసుకొని ఈ కోటరీ మరింత అతి చేస్తుందన్న వాదన సైతం కార్యకర్తల్లో వినిపిస్తున్నది. అటు అధినేత.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకోక తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలనే అర్థం కావడం లేదని కార్యకర్తలు, కింది స్థాయి లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరే పార్టీలో కీలక లీడర్లు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా కనీసం వారితో మాట్లాడితే అంతో ఇంతో ధైర్యం, భరోసా వస్తుందన్న నమ్మకం కార్యకర్తల్లో ఉంది. కానీ.. కనీసం కలిసే సమయం ఇవ్వకపోవడంతో ఇప్పుడు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నేతలంతా వారిపై, పార్టీపైనా అసంతృప్తితోనే ఉన్నారు. కనీసం సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాల నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చినా నేతలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరనే చర్చ నడుస్తున్నది. చాలా సందర్భాల్లో భవన్ వరకు వచ్చి కలువకుండానే రిటర్న్ వచ్చినట్లు ఓ కార్యకర్త చెప్పుకొచ్చాడు. కేసీఆర్‌ను కలిసే అవకాశం లేకున్నా.. కేటీఆర్‌ను కలుద్దామంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీ అందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులకు అపాయింట్‌మెంట్ ఇచ్చి వారికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని చాలా మంది కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
వరుసగా ఓటములు ఎదురవుతున్నా..
గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఓటములు తప్పడం లేదు. ఏ ఎన్నికల్లో చూసినా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా ఉన్నప్పటికీ.. ఈ రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ ఆ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఆ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కచ్చితంగా లోకల్ లీడర్లే చాలా ముఖ్యం. వారు కష్టపడి పని చేస్తేనే మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది.






