వారి పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది: KTR

by Gantepaka Srikanth |

వారి పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది: KTR

వారి పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది: KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పదని తెలిపారు. రెండేళ్లుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని మోసం చేసిందని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షం గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.

ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది బీఆర్ఎస్ అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని, అందుకే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను భారత రాష్ట్ర సమితి నేతలకు కట్టపెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను తట్టుకొని వీరోచితంగా పోరాడి, బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్లకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సామాన్య విజయం కాదని.. చరిత్రలో నిలిచిపోయే పోరాటమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందని తెలిపారు. పంచాయతీ ఫలితాలతో రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని ఎద్దేవా చేశారు. సీఎం కాలికి బలపం కట్టుకొని తిరిగినా, మంత్రులు మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడిందని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్ అని అభివర్ణించారు.

సిరిసిల్ల గడ్డ.. గులాబీ అడ్డా..

సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని, సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని కేటీఆర్ తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 117 గ్రామ పంచాయతీలకు గాను, బీఆర్ఎస్ మద్దతుదారులు ఏకంగా 80 స్థానాల్లో ఘనవిజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలలోని 117 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరగగా 80 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన పార్టీ నాయకులు విజయం సాధించినట్లు తెలిపారు. అధికార దుర్వినియోగం, బల ప్రయోగం చేసిన అధికార పార్టీ కాంగ్రెస్ కేవలం 24 స్థానాల్లో చాలా కష్టం మీద గెలిచిందని.. బీజేపీ కేవలం 13 గ్రామ పంచాయతీల్లో మద్దతుదారులను గెలిపించుకోగలిగిందని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధం ఎంత బలమైనదో ఈ ఫలితాలు మరోసారి తేల్చిచెప్పాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు, ఎన్నికల కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Next Story