జైల్లో పెట్టినా భయపడేది లేదు.. మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

మరోసారి ఫార్ములా ఈ రేస్ అనే అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి వాళ్ళు చేసింది ఏమీ లేదన్నారు.

జైల్లో పెట్టినా భయపడేది లేదు.. మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు శనివారం మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని, వాళ్ళు ఆశించినన్ని స్థానాలు రాలేదన్నారు. మా పార్టీ కార్యకర్తల గట్టి పోరాటం వలన, అద్భుతంగా పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా 30 మున్సిపాలిటీల పైగా వస్తాయి అనుకున్నామని అన్నారు. కానీ వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా మాకు విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేసింది.. హడావిడి చేసింది. కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారు.. అని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందని అన్నారు.

పార్టీ అధినేతలు తిరిగితే ప్రయోజనం ఉండదు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఉండదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు, ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్లకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారు.. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం అని అన్నారు.

మరోసారి ఫార్ములా ఈ రేస్

ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. నిన్నటి దాకా కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట చెప్తున్నారని, ప్రస్తుతం ఉన్న నిబంధనల పైన ఎవరికీ స్పష్టత లేదని ఆరోపించారు. మరోసారి ఫార్ములా ఈ రేస్ అనే అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తున్నదని తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి వాళ్ళు చేసింది ఏమీ లేదన్నారు. కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉందన్నారు. ఎన్ని సార్లు పిలిచినా పోతాము, ఉన్న సత్యం స్పష్టంగా చెబుతామన్నారు. ఎన్ని సార్లు పిలిచినా, ఎన్ని సార్లు విచారణ చేసినా మాకేమీ ఇబ్బంది లేదని, చివరికి జైలులో పెట్టినా భయపడేది లేదు.. అని ధీమా వ్యక్తం చేశారు. ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్ అధికారులు, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లు వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? అప్పుడు కేవలం కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచిందని, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని గెలిచింది? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు GHMC లో ఎన్ని గెలిచాడు? ఇప్పుడు మేము ఎన్ని గెలిచాము? ప్రజలకు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు.. అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story