- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: తెలంగాణ బిడ్డ ద్వారానే సమాచారం..
హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకొని లక్షల కోట్ల ప్రజల భూమిని కాపాడే దాకా తాము పోరాడుతామని.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకొని లక్షల కోట్ల ప్రజల భూమిని కాపాడే దాకా తాము పోరాడుతామని.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూముల కోసం కాంగ్రెస్ పార్టీ హిల్ట్ పాలసీ పేరుతో చేస్తున్న భూ కుంభకోణాన్ని ఎండగట్టేందుకు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌లో హమాలీలతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని అన్నారు. పరిశ్రమలు వద్దంటూ అపార్ట్మెంట్లు విల్లాలు కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నదని.. అందులో కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందని తెలిపారు. లక్షన్నర రూపాయలకు గజం ధర మార్కెట్లో పలుకుతుంటే కేవలం రూ.4,000 ప్రయివేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఇండ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి శ్మశానాలకు స్థలం లేదు కానీ ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటున్నదని పేర్కొన్నారు. ఆ భూములను వెనక్కి తీసుకొని అక్కడ కాంగ్రెస్ చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలని డిమాండ్ చేశారు.
త్వరలో అఖిలపక్ష సమావేశం
ఇక్కడ ఉన్న కంపెనీలు తరలి వెళ్తే హైదరాబాద్ నగరంలో వాటిపై ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ, దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిర్ధారణ జరగాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని ఇక్కడితో బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని.. కాంగ్రెస్ పార్టీ హిల్ట్ పాలసీ కుంభకోణంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని.. ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఈ పాలసీది రద్దు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తామన్నారు. రేవంత్‌రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే అటు పారిశ్రామిక భూములతోపాటు డబ్బులు కూడా పోతాయని హెచ్చరించారు.
తెలంగాణ బిడ్డ ద్వారానే సమాచారం..
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న తెలంగాణ బిడ్డ తమకు సమాచారం ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సమాచారం లీక్ అయిందంటూ బాధపడుతున్నదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము పర్యటిస్తున్న జీడిమెట్ల ప్రాంతంలో గజం ధర లక్ష రూపాయలు ఉన్నదని, కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.4,000లకే కట్టబెడతామని చెప్తున్నదని ఆరోపించారు. తాము గతంలో తెచ్చిన గ్రిడ్ పాలసీ ద్వారా కేవలం ఐటీ కార్యాలయాలు మాత్రమే నిర్మాణం చేసేందుకు అవకాశం ఉండేదని.. ఐటీ కార్యాలయాల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతోపాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగడమే కాకుండా పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పారిశ్రామిక భూములను ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలకు తిరిగి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐటీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మాత్రమే అనుమతించాలన్నారు. అంతేకానీ అప్పనంగా అపార్ట్మెంట్లకు, విల్లాలకు ఇస్తామంటే కుదరదన్నారు. రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ఆయనకు తెలిసింది కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే.. అందుకే అక్కడ ఫార్మాసిటీలో.. ఇక్కడ పారిశ్రామిక భూముల్లో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానందగౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శాంభీపూర్ రాజు, స్థానిక నాయకులు ఉన్నారు.






