ఎస్ఐఆర్‌లో ఓట్లు పోకుండా చూస్తాం: కేటీఆర్

by Naga Rani Yarlagadda |

జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

ఎస్ఐఆర్‌లో ఓట్లు పోకుండా చూస్తాం: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సర్ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని చెప్పారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు తెలిపారు. స్థానికంగానూ పార్టీ తరఫున ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవెల్ అసిస్టెంట్ల ద్వారా గల్ఫ్‌లోని తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ సీనియర్ నేత సురేశ్‌రెడ్డితోపాటు జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిగా నియమితులైన వీజీ గౌడ్, జనరల్ సెక్రెటరీ పాల్గొన్నారు.

Next Story