KTR: దేశంలోనే సక్సెస్‌ఫుల్ స్టార్టప్ స్టేట్ తెలంగాణ

by Gantepaka Srikanth |

స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

KTR: దేశంలోనే సక్సెస్‌ఫుల్ స్టార్టప్ స్టేట్ తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్‌లో నిర్వహించిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనమన్నారు. తాము అవకాశాల కోసం ఎదురుచూడలేదని.. వాటిని అందిపుచ్చుకునేందుకు అద్భుతమైన పాలసీలను తయారు చేశామని తెలిపారు. తద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని పేర్కొన్నారు. 2027లో భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, కేవలం పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని అన్నారు.

రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు అన్న ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. భారతదేశం 28 ఇంజిన్లు కలిగిన ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ లాంటిదన్నారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకాలను కేటీఆర్ వివరించారు. ఐటీ ఎగుమతులు రూ.57వేల కోట్ల నుండి రూ.2.72 లక్షల కోట్లకు పెరిగాయని.. ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుండి దాదాపు 10 లక్షలకు చేరుకున్నదని తెలిపారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్ కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు. హైదరాబాద్‌లో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన 'కాళేశ్వరం' ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు.

Next Story