KTR: భారత్‌లో మైనార్టీలకు కేసీఆర్‌ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

భారత్‌లో మైనార్టీలకు కేసీఆర్‌ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

KTR: భారత్‌లో మైనార్టీలకు కేసీఆర్‌ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో మైనార్టీలకు కేసీఆర్‌ (KCR) చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదివారం శంషాబాద్‌లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్‌ మైనార్టీ డిక్లరేషన్‌ ప్రకటించిందని, మార్పు తెస్తాం అంటూ ప్రచారం చేసిందని విమర్శించారు. రెండేళ్ల క్రితం మైనార్టీల కోసం 4వేల కోట్ల బడ్జెట్‌ పెడతామన్నారు.. పెట్టారా? లేదని అన్నారు. మైనార్టీ సబ్‌ ప్లాన్‌ కూడా తెస్తామని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పిందన్నారు. రెండేళ్లు అయిపోయాయి.. ఇంకో మూడేళ్లలో కూడా వీళ్లు చేసేది ఏమీ ఉండదని తీవ్ర విమర్శలు గుప్పించారు. మైనార్టీలను కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌కుగా చూస్తోందని అన్నారు.

మైనార్టీ స్కూళ్లను కేసీఆర్‌ ప్రారంభించారు.. మైనార్టీ స్కూళ్ల వల్ల ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారని చెప్పారు. నాలుగు ఉన్న మెడికల్‌ కాలేజీలు కేసీఆర్‌ 34కు పెంచారన్నారు. విద్యార్థులకు 20 లక్షల స్కాలర్‌షిప్‌ ఇచ్చారు.. ఈ పదేళ్లలో ఎన్నో పనులు చేశామన్నారు. తెలంగాణలో 45 లక్షల మంది ముస్లింలు ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌ హయాంలో ఒక్కొక్కరిపై రూ.5 వేల రూపాయలు ఖర్చు చేశారు.. ఇది అన్ని రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ అని చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం అత్యధికంగా ఖర్చు చేసింది కేసీఆరేనని, ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో అసదుద్దీన్‌ ఒవైసీ కూడా చెప్పారు.. కానీ ఇక్కడ చెప్పరు.. అని అన్నారు.

బుల్డోజర్‌ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ విమర్శించారు.. ఇక్కడ అదే బుల్డోజర్‌ రాజ్యం నడుస్తుంటే రాహుల్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. హైడ్రా పై రాహుల్‌ గాంధీ సైలెంట్‌గా ఉంటారని చెప్పారు. చౌకీదార్‌ చోర్‌ అని రాహుల్ అంటే.. రేవంత్‌ రెడ్డి కాదు కాదు.. ఆయన నా పెద్దన్న అని చెబుతారని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు మోడీ జేబు సంస్థలు అని విమర్శిస్తే.. రేవంత్‌ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ లేరన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనైనా ఒక్క మైనార్టీ లీడర్‌ను కూడా ఎన్నుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చినట్లే ఇచ్చి అజారుద్దీన్‌ను పక్కన పెట్టేశారని అన్నారు. క్రికెట్‌లో అజారుద్దీన్‌ కట్‌ షాట్‌లు కొడితే.. ఇక్కడ అజారుద్దీన్‌నే కట్‌ చేసేశారు రేవంత్‌ రెడ్డి అని సెటైర్లు వేశారు. ఇలాంటి మైనార్టీ సమావేశాలు ప్రతి జిల్లాలో జరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో కేసీఆర్‌ మరోసారి రావాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు మైనార్టీలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Next Story