- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. సీబీఎస్ఈ ఫలితాలపై కేటీఆర్ ఫైర్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల విడుదల చేసిన క్లాస్ 12 ఫలితాలపై నెలకొన్న వివాదంపై.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల విడుదల చేసిన క్లాస్ 12 ఫలితాలపై నెలకొన్న వివాదంపై.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళానికి కారణమైన సంస్థే.. ఇప్పుడు పేరు మార్చుకుని సీబీఎస్ఈ కాంట్రాక్ట్ దక్కించుకుందని ఆరోపించారు. సీబీఎస్ఈ మార్కుల కేటాయింపులో జరిగిన తప్పులపై, తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా పోరాడుతున్న 12వ తరగతి విద్యార్థులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నిస్తూ.. జవాబుదారీలుగా నిలబెడుతున్న విద్యార్థుల తెగింపు ఎంతో స్ఫూర్తి దాయకమని కొనియాడారు.
2019లో రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను తారుమారు చేసి తీవ్ర గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థే.. ఇప్పుడు పేరు మార్చుకుని సీబీఎస్ఈ నుంచి అంతకంటే పెద్ద కాంట్రాక్టును దక్కించుకోవడం దురదృష్టకరమన్నారు. ఒక అసమర్థ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే సీబీఎస్ఈ బోర్డు పదే పదే తన నిబంధనలను మార్చిందని, ఆ సంస్థ గత చరిత్రను పూర్తిగా మరిచిపోయిందని ఆరోపించారు. 2019లో జరిగిన గ్లోబరీనా వివాదంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులను తొలగించడమే కాకుండా.. సంస్థను కోర్టుకు ఈడ్చామని కూడా కేటీఆర్ గుర్తుచేశారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పెద్ద తప్పుకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ గందరగోళంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే సమాధానం చెప్పాలని, ఇలాంటి విఫలమైన, అవినీతిమయమైన వ్యవస్థలపై దేశ భవిష్యత్తును నిర్మించలేమని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు.






