- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటాలి.. కరీంనగర్ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
రాబోయే మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: రాబోయే మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న వరంగల్ నేతలతో సమావేశమైన కేటీఆర్ నేడు కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో, మున్సిపల్ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 24 నెలల కాంగ్రెస్ మోసం, పాలన వైఫల్యంపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహంతో ఉన్నదని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలు పట్టణాల్లో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ఖర్చు చేయలేదని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పాలనను ప్రజలు తిరస్కరించారన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అడ్డదారులు తొక్కినా 4000 పైచిలుకు గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలవడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి స్పష్టమైన సంకేతమని చెప్పారు. రేవంత్ చేతకాని పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పడానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష సాక్షమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ తప్పదని అన్నారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే అధికార పక్షంపైన ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అసెంబ్లీ ఫలితాల అనంతరం పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని దాటుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరంతర పోరాటం చేస్తూ మరోసారి ప్రజల మనసును చురగొన్నదని అన్నారు. గులాబీజెండాకు పూర్వ వైభవం తెచ్చేందుకు సరిహద్దుల్లో పనిచేసే సైనికుల్లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ పాలనలో పట్టణాల్లో కొత్తగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, మున్సిపాలిటీలు సమస్యలకు కేరాఫ్‌గా మారాయని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నిధులకు పనులకు తిరిగి శిలాఫలకాలు వేయడం తప్పించి రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క పని కూడా లేదన్నారు. సుమారు దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ హయాంలో పట్టణ ప్రగతితో పురపాలికల రూపురేఖలు మారిపోయాయని, ప్రతి మున్సిపాలిటీని గ్రోత్ ఇంజన్లుగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. పట్టణ ప్రగతితో పాటు ప్రతి మునిసిపాలిటీలో అవసరమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని, వీటిని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ కంచు కోట అని, రెండున్నర దశాబ్దాలుగా అన్ని ఎన్నికల్లో పార్టీ వెంట కరీంనగర్ ప్రజానీకం నిలబడ్డారన్నారు.






