అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది: రెచ్చిపోయిన కేటీఆర్

by Gantepaka Srikanth |

ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది: రెచ్చిపోయిన కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణవాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి. గుర్తుపెట్టుకో రేవంత్..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏ జాతికి నువ్వు జాతి పిత? ఏ జాతి అని మాట్లాడుతున్నావు?. వాడికి నేను చెప్తున్నా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి.. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్లకి మాత్రమే జాతి అంటే జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుందని అన్నారు. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు.. ప్రాణాలకు తెగించి కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు.. సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలవదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుపడి నిలబడ్డోళ్లకు జాతి అంటే ఏంటి, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుస్తదని అన్నారు. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తదని ఫైర్ అయ్యారు.

సమ్మక్క-సారలమ్మల జాతి

రక్తంలో పౌరుషం ఉంటే.. డీఎన్ఏలో ఉద్యమం ఉంటే.. ఆత్మాభిమానం అనేది ఉంటే జాతి చరిత్ర అంటే తెలుస్తదని సూచించారు. జై తెలంగాణ నినాదం చెప్పడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్‌కు తెలంగాణ సోయి లేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలవదని అన్నారు. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి తమదని.. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి తమదని.. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క-సారలమ్మల జాతి తమదని.. కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి తమదని.. భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి తమదని.. బరిలో బందూకు పట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జాతి తమదని అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి జాతి తమదని అన్నారు. కర్కశ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులు బాసిన యువ కిశోరాల జాతి తమదని.. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి తమదని అన్నారు. రేవంత్‌లా ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం తాము కాదని.. ఢిల్లీకి ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు తమదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎన్నడూ తాను జాతిపితనని చెప్పుకోలేదని.. ప్రజలే పిలుచుకున్నారని అన్నారు. ఎవరైతే స్వాతంత్ర్యం తెచ్చారో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని తెలిపారు. ‘ఏ తండ్రి అయినా ఆ కొడుకుకు, ఆ పిల్లలకు హీరోగా ఉంటారు. కానీ నా తండ్రి ఇవాళ తెలంగాణకు హీరో, అది తెలంగాణ జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం’ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు అని.. దాన్ని ఎట్లా చెరిపేస్తావురా సన్నాసి? అని విమర్శించారు. కేసీఆర్ లాంటి మహానాయకుడికి ఇచ్చే బహుమతి ఒక్కటేనని.. ఐకమత్యంగా కొట్లాడుదామని.. మళ్లీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ సీఎంను చేయడమే ఆ మహానాయకుడికి ఇచ్చే చిరుకానుక అని తెలిపారు.

నేడు ఒక ఉద్యమం పుట్టినరోజు

‘నేడు ఒక నాయకుడి పుట్టిన రోజు కాదు. ఒక ఉద్యమం పుట్టిన రోజు’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. చరిత్ర పుట్లలో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఒక కౌన్సిలర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాలు, పొత్తులు చూశామని.. పదవి కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసిపోయాయని ఆరోపించారు. కానీ.. కేసీఆర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. ఓటమి తాత్కాలికమని.. మళ్లీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. అనంతరం కేసీఆర్ జన్మదిన వేడుకలు మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, యువ నాయకుడు తలసాని సాయి కిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి గా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, సుధీర్‌రెడ్డి, తెలంగాణ భవన్ ఇన్‌చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story