కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతుండు.. బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-20 10:08:57  IST  )

కేంద్ర మంత్రి పదవి నుంచి తనను తప్పించాలన్న బీఆర్ఎస్ డిమాండ్లపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతుండు.. బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో కేసీఆర్ (KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో బీజేపీ పోరాటమే కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇప్పుడు అదే కక్షతోనే గులాబీ నేతలు తన పదవి పోవాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక్క లోక్‌సభ ఎంపీ కూడా లేని బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం నడవడం లేదని కామెంట్ చేశారు. ఇక కేటీఆర్ ఓ ‘ఫేక్ మీడియా ఫ్యాక్టరీ’ని నడుపుతున్నారని, సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కొంత మంది స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, కొత్త పార్టీ పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు తానేంటో, తన నిజాయితీ ఏంటో బాగా తెలుసని ఆయన స్పష్టం చేశారు.

కొడుకు కేసుపై కీలక వ్యాఖ్యలు..

తన కుమారుడికి సంబంధించిన వివాదంపై బండి సంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే కన్న కొడుకునైనా సరే పోలీసులకు అప్పగించిన చరిత్ర తనదని అన్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు (High Court) పరిధిలో ఉన్నందున, చట్టాన్ని గౌరవిస్తూ ఈ అంశంపై ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Next Story