ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : కేటీఆర్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో రైతుబంధు పాలనపోయి రాబందుల పాలన వచ్చిందని కేటీఆర్ విమర్శించారు.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ధ్వజమెత్తారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18న తాను స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వెళ్లానన్నారు. ఆ ముందురోజే ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి తన పంట కష్టాలను చెప్పుకుంటూ మీడియాముందు కన్నీటి పర్యంతమయ్యాడని గుర్తుచేశారు. నాలుగు రోజులుగా మార్కెట్‌ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడన్నారు. కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే, తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించాడని తెలిపారు. ఆ తర్వాత కూడా గణపతికి రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. గణపతిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యేనని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో రైతుబంధు పాలనపోయి.. రాబందుల పాలన వచ్చిందని విమర్శించారు.

Next Story