KTR: సౌదీలో బస్సు ప్రమాదం.. రంగంలోకి కేటీఆర్.. మైనార్టీ నేతలకు కీలక ఆదేశాలు

by Ramesh Naini |

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన మైనార్టీ సోదరుల కుటుంబాలకు అండగా నిలవడానికి తెలంగాణ బీఆర్ఎస్ నాయకత్వం అప్రమత్తమైంది.

KTR: సౌదీలో బస్సు ప్రమాదం.. రంగంలోకి కేటీఆర్.. మైనార్టీ నేతలకు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన మైనార్టీ సోదరుల కుటుంబాలకు అండగా నిలవడానికి తెలంగాణ బీఆర్ఎస్ నాయకత్వం అప్రమత్తమైంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు, అవసరమైన సహాయ చర్యలను పరిశీలించేందుకు సౌదీకి వెళ్లాలని బీఆర్ఎస్ మైనార్టీ నేతలకు కేటీఆర్ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో సహా పలువురు సీనియర్ మైనార్టీ నేతలతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిసింది.

కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మైనార్టీ నాయకుల ప్రత్యేక బృందం సౌదీకి బయలుదేరేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. పరిస్థితులు తెలుసుకుని బాధిత కుటుంబాలతో సమన్వయం చేసేందుకు ఈ బృందం అక్కడికి వెళ్లనుంది. ఇదిలా ఉండగా, సౌదీ బస్సు ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందినట్లు హజ్ కమిటీ స్పష్టం చేసింది. మరణించిన వారంతా హైదరాబాద్‌కు చెందినవారేనని వెల్లడించింది. సౌదీ ప్రమాదంతో మైనార్టీ సంఘాలలో తీవ్ర విషాదం నెలకొన్న నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు సహాయ చర్యలను వేగవంతం చేయడానికి ప్రభుత్వ, సంస్థాగత స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఇవాళ తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.

Next Story