మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి KTR డెడ్‌లైన్.. ఆ తర్వాత చేసేది అదే అంటూ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-03 11:45:56  IST  )

కేసీఆర్(KCR) మీద కోపంతో మేడిగడ్డ బ్యారేజ్‌(Medigadda Barrage)లో డ్యామేజ్‌ అయిన పిల్లర్‌ను రిపేర్ చేయకుండా రైతులను గోస పెడుతున్నారని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి KTR డెడ్‌లైన్.. ఆ తర్వాత చేసేది అదే అంటూ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌‌డెస్క్: కేసీఆర్(KCR) మీద కోపంతో మేడిగడ్డ బ్యారేజ్‌(Medigadda Barrage)లో డ్యామేజ్‌ అయిన పిల్లర్‌ను రిపేర్ చేయకుండా రైతులను గోస పెడుతున్నారని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తడి దుంకినాయని గుర్తుచేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్(Congress) అంటే శనీశ్వరం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించి కేసీఆర్‌పై ఉన్న కోపం, ద్వేషంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోయేలా రేవంత్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు.

సిరిసిల్ల, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో సాగునీరు లేక వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం(Kaleswaram) నుంచి నీళ్లు తీసుకొచ్చి కేసీఆర్ మల్కపేట రిజర్వాయర్‌లో పోస్తే, దేవునిగుట్ట తండాలో రైతులు సాగు చేసేవారని అన్నారు. ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు.. మేడిగడ్డ పర్రెను రిపేర్ చేసి నీళ్లు ఇవ్వొచ్చు.. కానీ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సిరిసిల్ల(Sircilla) జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఇలాగే వ్యవహరిస్తూ చూస్తూ ఊరుకోం.. 48 గంటల్లో నీళ్లు విడుదల చేయాలి.. లేకపోతే సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ ఎదుట స్వయంగా ధర్నా చేస్తా అని కేటీఆర్ హెచ్చరించారు.

‘కేసీఆర్‌పై కోపం ఉంటే రాజకీయంగా తలపడాలి, రైతులను గోస పెట్టొద్దు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇప్పటికే 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదు. రైతు బంధును కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే తెలివి లేదు, నీళ్లు ఇచ్చే తెలివి లేదు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను కాపాడాలన్నారు. సాగునీళ్లు విడుదల చేయకపోతే, అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story