KTR: ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు.. ఫార్మా సిటీ భూములపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR: ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు.. ఫార్మా సిటీ భూములపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీ (Future City)కి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని ఆయన ఆరోపించారు. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ (KCR) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ (Hyderabad Pharma City) ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసింది, స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చి తమ భూములను ఫార్మాసిటీ కోసం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. అయితే కొంతమంది తమ భూములు ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన ప్రతి ఎకరాన్ని తిరిగి రైతన్నలకు ఇస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారిని నిండా మోసం చేసిందని ఆరోపించారు. దీంతో వేలకోట్ల రూపాయల ఫార్మా సిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయి, లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయిందన్నారు.

ఫార్మా సిటీ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో మౌలిక వసతుల కల్పనను ప్రారంభించినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని పక్కనపెట్టి, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను అక్రమంగా రియల్ ఎస్టేట్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

Next Story